ఏపీలో అధికార టీడీపీకి ఇటీవల వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి.వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర రాజధాని జిల్లాలకు చేరుకోగానే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధికార పార్టీ నుంచి విపక్ష వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు కంటిన్యూ అయ్యాయి.
టీడీపీలో కీలక నేతలుగా ఉన్న యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్లు వైసీపీలోకి జంప్ చేసేశారు.జగన్ పాదయాత్ర తర్వాత ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఊపు వచ్చిందన్నది నిజం.
ఈ క్రమంలోనే ఇప్పుడు రాజధాని ఏరియా నుంచి అధికార పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించడంతో పాటు వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆ ఇద్దరు పార్టీ మారుతున్నారా ? అన్న సందేహాలు అక్కడ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇద్దరూ చేస్తోన్న వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి.గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి చివరి క్షణంలో సీటు దక్కించుకున్న మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిషోర్‌బాబు ఆ వెంటనే సామాజికవర్గ కోణంలో మంత్రి కూడా అయ్యారు.ఆ తర్వాత రావెల తీరుతో పాటు ఆయన దురుసుతనం, ఆయన కుమారుల వ్యవహారంతో పార్టీ పరువు ఖాస్తా బజారున పడింది.
చివరకు ఆయన శాఖలోనూ, ఇటు నియోజకవర్గంలో ఆయన తీరుతోనూ విసిగిపోయిన చంద్రబాబు ఆయన్ను కేబినెట్ ప్రక్షాళనలో తప్పించారు.
కొద్ది రోజులుగా రావెల పార్టీలోని నేతలనే టార్గెట్ చేస్తున్నారు.
ఇటు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు తాజాగా వర్ల రామయ్యపై ఆయన కూడా ఓపెన్‌గానే విమర్శలు చేస్తున్నారు.మంత్రి పదవి ఊడినా కూడా ఆయన మాత్రం టీడీపీ అధిష్టానాన్నే టార్గెట్‌గా చేసుకుని మాట్లాడుతున్నారన్న భావనకు అధిష్టానం వచ్చేసింది.
తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించిన రావెల ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో దళితజాతిలో అభద్రతా భావం పెరుగుతోందని పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారన్న చర్చ స్టార్ట్ అయ్యింది.
ఇక తాజాగా వర్ల రామయ్యపై విమర్శలు గుప్పించిన రావెల ఆయన మాదిగ జాతికే క్షమాపణలు చెప్పాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎలాగూ టిక్కెట్ రాదని డిసైడ్ అయ్యింది.ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే వైసీపీ ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో పార్టీ మారితే ప్రత్తిపాడు టిక్కెట్ లేదా బాపట్ల ఎంపీ సీటు ఇస్తారా ? అనే అంశంపై చర్చలు జరిపినట్టు టాక్.ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవడంతో కూడా టీడీపీలో అయితే ఆయనకు టిక్కెట్ రాదని తేలిపోయింది.
ఎలాగూ పార్టీలో ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిన రావెల పార్టీని ఏదోలా ఇరికించే వ్యాఖ్యలు చేసి బయటకు పోవాలని చూస్తున్నట్టు టాక్.
ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిది మరోదారి.
మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి అలా ఇలా లేదు.ఇక ఆయన బావ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గత ఎన్నికల్లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పటికే మోదుగుల చంద్రబాబు, టీడీపీ అధిష్టానంతో పాటు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నేరుగానే టార్గెట్‌గా చేస్తున్నారు.మన ప్రభుత్వం ఉండి కూడా పనులు కావడం లేదని విమర్శిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి నరసారావుపేట ఎంపీగానే పోటీ చేస్తానని చెపుతున్నారు.అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఆయన్ను మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తోందట.
మెదుగుల మరో బంధువు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల లోగా మోదుగుల విషయంలో ఏదైనా జరగవచ్చని అంటున్నారు.
ఆయన చూపు వైసీపీ వైపు కూడా ఉంది.ఏదేమైనా రాజధాని జిల్లాలో ఈ ఇద్దరు టీడీపీ సిట్టింగ్‌ల వ్యవహార శైలి ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.