సాధారణంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం మనకి స్పష్టంగా అర్ధం అవుతుంది.అమ్మవారితో సహా స్వామివారు వెలసిన దేవాలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు ఉండటం మనం చూస్తూనే ఉంటాం.
అలాగే దైవ కార్యాల్లోనూ … శుభకార్యాలలోను భార్యా భర్తలు పాల్గొన్నప్పుడు భర్తకి ఎడమవైపున మాత్రమే భార్య వుండాలని పెద్దలు చెబుతుంటారు.భార్యాభర్తలు ఫోటో దిగుతున్నా ఈ విషయాన్ని మాత్రం మరిచిపోరు.
అంతగా ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో పెనవేసుకుపోయింది.
మన పెద్దవారు ఏ పనిచేసినా అందులో ఒక అర్థం … పరమార్థం తప్పనిసరిగా ఉంటాయి.
ఇదే విషయం మరోమారు ఇక్కడ స్పష్టమవుతుంది.శరీరంలో కుడిభాగాన్ని సవ్య భాగమనీ … ఎడమ భాగాన్ని అపసవ్య భాగమని అంటూ వుంటారు.
కుడిభాగానికి వుండే శక్తి సామర్థ్యాలు ఎడమభాగానికి వుండవు.అందువలన ఎప్పటికప్పుడు ఎడమభాగానికి అదనపు శక్తి అవసరమవుతుంటుంది.
కుడి భాగాన్ని శివుడికి సంకేతంగాను … ఎడమభాగం ‘శక్తి’కి సంకేతంగాను చెబుతుంటారు.ఈ కుడి ఎడమల కలయికనే అర్థనారీశ్వర రూపమని అంటుంటారు.
శరీరంలో ఎడమభాగం ‘శక్తి’ భాగం కనుక, భర్తకి ఎడమవైపునే భార్య ఉండాలనే నియమాన్ని పెట్టారు.ఈ విధమైన ఆచారాన్నిపాటించడం వలన ఆలోచన … ఆచరణ అనేవి సమపాళ్లుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని నమ్మకం.