భారతదేశంలోని పెద్ద నదుల్లో గోదావరి( Godavari River ) ఒకటి.ఏక్కడో మహారాష్ట్రలో పుట్టి ఎన్నో ప్రాంతాలను, పర్వతాలను దాటి బాసర వద్ద తెలుగు నేలపైకి అడుగుపెడుతుంది.
తెలుగుజాతి చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక సంపదకు గోదారమ్మ సజీవ సాక్ష్యం.ఎందరో రాజులు గోదావరి గడ్డపై రాజ్యాలనేలారు.
ఎన్నో కావ్యాలు, ఎందరో కవులు, కళాకారులు, మహనీయులకు జన్మనిచ్చింది గోదావరి తల్లి.ఏడాది పొడవునా నీటితో పరవళ్లు తొక్కుతూ తెలుగు నేలను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చింది.
అంతటి గోదారిని నేడు కాలుష్య రక్కసి పట్టి పీడిస్తోంది.మురుగు నీటితో పాటు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధ జలాలు, చెత్తా, చెదారంతో జీవ నది గోదారి కంపు కొడుతోంది.
దీంతో గోదావరిని కాలుష్యం నుంచి కాపాడాలని ఎందరో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.కానీ పాలకులు పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలో 15 ఏళ్ల వయసులో, అది కూడా అమెరికాలో( America ) వుంటూ ఓ బాలిక గోదావరి దుస్థితిని చూసి తల్లాడిపోయింది.ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా గోదారమ్మను కాపాడుకుందామని నడుం బిగించింది.
అమెరికాలోని మెంఫిస్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఉమాశ్రీ పూజ్యం( Umasri Pujyam ) అనే బాలిక ‘‘సేవ్ గోదావరి’’( Save Godavari ) పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.కొద్దిరోజుల క్రితం ఆమె తన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా రాజోలు సమీపంలోని పొన్నమండను సందర్శించినప్పుడు గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకోవడాన్ని చూసి ఈ మిషన్‌ను ప్రారంభించింది.
గత రెండేళ్లుగా కాలుష్య సమస్యను పరిష్కారించడానికి స్థానిక కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లను ఒకచోట చేర్చి గోదావరి ప్రక్షాళన పనులు మొదలుపెట్టింది.అది ఇప్పుడు 100 రోజులకు చేరింది.వ్యర్ధాలను సరైన విధంగా పారవేయడం, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని తగ్గించే మార్గాల గురించి ఉమాశ్రీ స్థానికులకు వివరిస్తోంది.నీటి కాలుష్యంపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ‘‘యూత్ ఎగైనెస్ట్ వాటర్ పొల్యూషన్’’ సంస్థను ఉమాశ్రీ స్థాపించింది.2021లో వర్చువల్ మోడ్‌లో తరగతులు నిర్వహించినప్పుడు .ఆమె చాలా నెలల పాటు భారత్‌లోనే వుండి మిషన్ కోసం సమయాన్ని వెచ్చించింది.వీటితో పాటు సోషల్ మీడియా, వెబ్సైట్ ద్వారా కూడా కాలుష్యంపై అవగాహన కల్పించింది.ప్రస్తుతం ఉమాశ్రీ పదో తరగతి చదువుతోంది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.తాను స్వగ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి గ్రామస్తులు తాము నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పారని వెల్లడించింది.పొన్నమండ గ్రామం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని.తన తల్లిదండ్రులిద్దరూ కోనసీమ జిల్లాలోనే పెరిగారని ఉమాశ్రీ తెలిపింది.తనకు 4 ఏళ్ల వయసున్నప్పుడు తమ కుటుంబం అమెరికా వెళ్లిందని.ఇప్పటికీ తమ బంధువులు ఈ గ్రామంలోనే వున్నారని పేర్కొంది.
లక్షలాది మంది ప్రజల జీవనానికి కేంద్రంగా వున్న గోదావరి నది కాలుష్యంతో సహా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఉమాశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందులను అధికంగా ఉపయోగించడం వల్ల ఇక్కడి నీరు వాగుల ద్వారా గోదావరిలోకి చేరి కలుషితమవుతున్నట్లు గుర్తించానని ఆమె పేర్కొంది.
ఈ క్రమంలోనే నదీ ప్రక్షాళన, పర్యావరణ మిషన్‌ను చేపట్టేలా చేసిందని ఉమాశ్రీ వెల్లడించింది.తన ప్రయత్నానికి అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, స్థానిక అధికారులు, ప్రజలు తనకు ఎంతో సహకారం అందించారని పేర్కొంది.