అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెన పైనుంచి దూకి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
వంతెనపై నుంచి ఎవరో దూకినట్లు ధ్రువీకరించుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించినట్లు యూఎస్ కోస్టల్ గార్డ్స్ తెలిపింది.అయితే బాలుడు ప్రాణాలతో వుండే అవకాశం తక్కువేని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై ఇండియన్ కమ్యూనిటీ నేత జైన్ భూటోరియా మాట్లాడుతూ.గోల్డెన్ గేట్ బ్రిడ్జి వద్ద ఇటీవలికాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు.భారత సంతతికి చెందిన వ్యక్తులకు కూడా ఇది సూసైడ్ స్పాట్‌గా మారిందని భూటోరియా ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు 1937లో ఈ వంతెన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2 వేలమందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ చెబుతోంది.
ఈ సంస్థ ఇక్కడ ఆత్మహత్యలను నివారించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.గతేడాది ఇక్కడ 25 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని ఈ సంస్థ చెబుతోంది.
అటు కాలిఫోర్నియా ప్రభుత్వం కూడా ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌కు ఇరువైపులా దాదాపు 20 అడుగుల ఎత్తులో ఇనుప కంచె నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.2018లో ఈ కంచె నిర్మాణం ప్రారంభం కాగా.ఈ ఏడాది జనవరికల్లా పూర్తి కావాల్సి వుంది.
అయితే ఖర్చు పెరగడంతో జాప్యం జరుగుతోంది.ఈలోపు విలువైన ప్రాణాలు పోతున్నాయి.