తగ్గు ముఖం పట్టిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ రూపంలో దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది.ఈ మాయదారి వైరస్‌తో విలవిలలాడిపోతున్న ప్రజలకు.
మరోవైపు బ్లాక్ ఫంగస్ సవాలు విసురుతోంది.కరోనా చికిత్సలో స్టెరాయిడ్లు విచ్చల విడిగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు.
మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అడుగు పెట్టిన ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పటికే వందకు పైగా మందిని బలి తీసుకుంది.అలాగే ఐదు వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి.
బ్లాక్ ఫంగస్ సోకితే కళ్లు ఎర్రబారి చూపు కోల్పోవడంతో పాటు శరీరంలోని అవయవాలు దెబ్బ తింటున్నాయి.ఈ క్రమంలోనే చాలా మంది మృత్యువాత పడుతున్నారు.అయితే బ్లాక్ ఫంగస్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.మరి బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి దాని లక్షణాలు ఏంటీ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ ఫంగస్ సోకితే కళ్లు నొప్పి పుట్టడం, ఎర్రగా మారడం, బ్లర్ బ్లర్‌గా కనిపించడం జరుగుతుంది.ముక్కు ద్వారాలు మూసుకు పోవడం, ముక్కు చుట్టూ ఎర్ర బారడం, ముక్కు నల్లగా మారడం జరుగుతుంది.తీవ్రమైన తల నొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపు వాంతులు, ఛాతిలో నొప్పి, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం, దవడ భాగంలో నొప్పి, తిమ్మిర్లు, వాపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించింది పరీక్షలు చేయించుకోవాలి.
దురదృష్టవశాత్తూ బ్లాక్ ఫంగస్ బారిన పడితే ఏ మాత్రం ఆందోళన చెంద కుండా సరైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి.లేదంటే ఈ బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారిపోతుంది.