వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి.వరదలతో ప్రజా జీవితం చిన్నాభిన్నం అవుతోంది.
ఒకవైపు వందలమంది ప్రాణాలు కోల్పోగా,మరోవైపు కేరళ ప్రభుత్వం వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది.కేరళ వరదల్లో ప్రాణాలు రక్షించబడిన వారివి ఒక్కొకరివి ఒక్కో కథలా ఉన్నాయి…సినిమా సన్నివేశాల్ని తలపించేలా కొన్ని ఘటనలు ఉండడం విశేషం.
తాజాగా వరదల్లో ప్రసవ వేధన పడుతున్ననిండు గర్భినిని రక్షించి హాస్పటల్ కి తరలించిన వైనం సోషల్ మీడియాలో వైరలైంది…
కోచి ప్రాంతానికి చెందిన సజిత అనే గర్భిణికి శుక్రవారం మధ్యాహ్నం పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.కనుచూపు మేరలో అంతా నీటిమయం కావడంతో ఆమెలో ఆందోళన మొదలైంది.
కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.హెలికాప్టర్ సాయంతో ఆమెను కాపాడి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
వరద నీటిలో చిక్కుకున్న గర్భిణిని ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.సజితను తాడు సాయంతో సురక్షితంగా హెలికాప్టర్లోకి చేరుస్తున్న వీడియో వైరల్ అయింది.అంతకుముందు ఆందోళనకు గురైన సజితకు వైద్యులు విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం నూరిపోశారు.
అయితే.వాతావరణం అనుకూలించకపోవడం మరింత ఆందోళన కలిగించింది.
ప్రతికూల వాతావరణంలోనూ పైలట్ విజయ్ వర్మ హెలికాప్టర్‌ను చాకచక్యంగా నడిపారు.ఆమె ప్రాణాలు కాపాడటాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు సవాలుగా తీసుకున్నారు.ఈ కారణంగానే సజిత ప్రాణాలు దక్కాయి.ఇండియన్ నేవీకి చెందిన ‘చేతన్’ బృందం కేవలం అర గంటలో ఈ ఆపరేషన్‌ను పూర్తిచేసింది ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది సేపటికే ప్రసవించిన సజిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అలప్పూజలోని ఆస్పత్రిలో ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు.తల్లి బిడ్డ సురక్షితంగా ఉండడంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేవు.
వైద్యులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సజిత కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ప్రాణాలకు సైతం తెగించి వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షిస్తుంది.
Salute them.