అమెరికాలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ కుంభకోణంలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులతో సహా 8 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది.భారతదేశం కేంద్రంగా నడిచిన ఈ స్కామ్‌లో వేలాది మంది అమెరికన్లను మోసం చేసి, 3.7 మిలియన్ డాలర్లను వసూలు చేసిన 8 మందిని కోర్టు సోమవారం దోషులుగా నిర్థారించింది.వీరిలో ముగ్గురు ఇండో- అమెరికన్లు ఉన్నారు.వీరందరికి జడ్జి ఆరు నెలల నుంచి నాలుగు సంవత్సరాల, తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారు.
నిందితులు వీరే:
*
మొహమ్మద్ ఖాజీమ్ మోమిన్, 33 (జార్జియా)
*
రోడ్రిగో లియోన్- కాస్టిల్లో, 46 (టెక్సాస్)
*
మొహమ్మద్ సోజాబ్ మోమిన్, 23 (జార్జియా)
*
డ్రూ కైల్ రిగ్గిన్స్, 24 (జార్జియా)
*
నికోలస్ అలెగ్జాండర్ డీన్, 26 (జార్జియా)
*
పాలక్ కుమార్ పటేల్, 30 (జార్జియా)
*
జాంట్జ్ పారిష్ మిల్లెర్, 25 (జార్జియా)
*
డెవిన్ బ్రాడ్‌ఫోర్డ్ పోప్, 25 (జార్జియా)
వీరంతా భారత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని యూఎస్ అటార్నీ బ్యూంగ్ జె బిజయ్ పాక్ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో తెలిపారు.డేటా బ్రోకర్లు, ఇతర వనరుల నుంచి సమాచారాన్ని ఉపయోగించి కాల్ సెంటర్ ఆపరేటర్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, లేదా రుణాలు ఇచ్చే వ్యక్తుల లాగా ఫోన్లు చేసేవారు.ప్రభుత్వానికి పన్నులు లేదా జరిమానాలు చెల్లించకపోతే అరెస్ట్, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని బెదిరించేవారని అటార్నీ తెలిపారు.
తద్వారా యూఎస్‌లోని ప్రజలను మోసం చేసి లబ్ధి పొందాలని భావించారని పాక్ అన్నారు.
వారి బెదిరింపులకు భయపడి బాధితులు నగదు చెల్లించడానికి అంగీకరించిన వెంటనే ప్రీపెయిడ్ డెబిట్ కార్లు, మనీగ్రామ్, వెస్ట్రన్ యూనియన్, వైర్ బదిలీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయమని కోరేవారని తేలింది.భారత్‌తో పాటు అమెరికాలోని అమాయకులను మోసం చేసేందుకు ప్రయత్నించిన వీరిపై యూఎస్ ప్రభుత్వం విచారణ జరుపుతుందని అటార్నీ స్పష్టం చేశారు.ఈ కుంభకోణంలో భారత్ కేంద్రంగా నడుస్తున్న ఐదు కాల్‌సెంటర్లతో పాటు ఏడుగురు భారతీయులపై వైర్ ఫ్రాడ్, మనీలాండరింగ్ సహా 27 కౌంట్ల అభియోగాలు నమోదు చేశారు.
విచారణ నిమిత్తం భారతీయ పౌరులను తమకు అప్పగించాల్సిందిగా అమెరికా ప్రభుత్వం కోరుతోంది.