కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్ కోటాలో కేంద్రం కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలని పిటిషన్ లో కోరారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అయితే హరిరామజోగయ్య తన పిటిషన్ లో ప్రస్తుత సీఎం జగన్ పేరును ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో పిటిషన్ కు నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది.దీంతో ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అనంతరం ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్ కు నంబర్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.అనంతరం తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.