ప్రముఖ టాలీవుడ్ నటి పావలా శ్యామల తాజాగా తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.తెలుగులో 300కు పైగా సినిమాలలో నటించిన పావలా శ్యామలకు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు రావడం లేదు.
ప్రస్తుతం పావలా శ్యామల దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు.ప్రస్తుతం ఆమె అనాథాశ్రమంలో కూతురితో పాటు ఉన్నారు.
తన కష్టాల గురించి పావలా శ్యామల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ షిప్ కోసం చిరంజీవి లక్ష రూపాయలు సహాయం చేశారని నా కూతురు ఆరోగ్యం బాగోలేదని తెలిసి చిరంజీవి మరో 2 లక్షల రూపాయల సహాయం చేశారని పావలా శ్యామల పేర్కొన్నారు.
ఇతరులు చేసిన ఆర్థిక సాయం వల్ల ఇన్నిరోజులు నెట్టుకొచ్చానని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం ఆత్మహత్య తప్ప నాకు ఎలాంటి బతుకుదెరువు లేదని ఆమె కామెంట్లు చేశారు.
నేను నా కూతురు విషం కొనుక్కుని తాగే శక్తి కూడా లేదని ఆమె చెప్పుకొచ్చారు. చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ప్రస్తుతం జీవనం సాగిస్తున్నామని ఆమె అన్నారు.
సాయం చేద్దామని వచ్చినా డబ్బులు తీసుకోలేదని అంత కావాలి ఇంత కావాలి అని డిమాండ్ చేస్తోందని కరాటే కళ్యాణి నా గురించి తప్పుగా ప్రచారం చేసిందని పావలా శ్యామల కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఉన్న అనాథాశ్రమంలో డబ్బులు కట్టినా బాగా చూసుకోవడం లేదని ఆమె అన్నారు.
విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు సహాయం చేయడానికి ఒక అమ్మాయిని పెట్టారని పావలా శ్యామల తెలిపారు.ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించిందని అయితే ఆపరేషన్ కు నా శరీరం తట్టుకోలేదని పావలా శ్యామల కామెంట్లు చేశారు.ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్లిపోయిందని ప్రస్తుతం నేను బ్రతికి ఉన్నానా? లేనా? అనే విషయాలను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదని పావలా శ్యామల చెప్పుకొచ్చారు.