సినిమా పరిశ్రమలో తనకంటే సీనియర్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే క్రిష్ణకు ఎంతో అభిమానం, గౌరవం.తన కంటే వయసులోనూ, అనుభవంలోనే పెద్దవారు కావడంతో ఎంతో గొప్పవారిగా భావించేవాడు.
వారితో సినిమాలు చేసే అవకాశాన్ని ఎప్పుడూ తను వదులుకోలేదు.అంతేకాదు.
ఆయన పలు సినిమాలను నిర్మించాడు కూడా.కాంతారావు అన్నకూడా ఆయనకు ఎంతో అభిమానం ఉండేది.
ఈయనతో కలిసి పలు సినిమాల్లో నటించాడు.
కత్తి కాంతారావు, క్రిష్ణ కలిసి నటించిన తొలి సినిమా ఇద్దరు మొనగాళ్లు.
అటు కాంతారావు సొంత సినిమా ప్రేమ జీవులులో క్రిష్ణ ఓ హీరోగా చేశాడు.మలయాళంలో విజయవంతం అయిన సినిమా ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమాలో క్రిష్ణకు జోడీగా రాజశ్రీ నటించింది.ఈ సినిమాలోని పలు పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.కొంత కాలం తర్వాత యువ హీరోలతో పోటీ ఎక్కువైంది.ఈ నేపథ్యంలో సొంత సినిమాలే మేలు అనుకున్నాడు కాంతారావు.అందుకే తన భార్య పేరిట ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సప్తస్వరాలు అనే సినిమా చేశాడు.ఇందులో కాంతారావు, రాజశ్రీ కలిసి నటించారు.
అయితే తొలి సినిమా కావడంతో బాగానే డబ్బు ఖర్చు చేసి నిర్మించాడు.కానీ అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది.
ఆ సమస్యతో తను చాలా ఇబ్బంది పడ్డాడు.
అటు సినిమా పరిశ్రమ నుంచి మరో పోటీ ఎదురయ్యింది.సినిమా నిర్మాత భావనారాయణ కాంతారావుకు చాలా సన్నిహితుడు.అయినా వ్యాపారం వేరే, స్నేహం వేరే అని భావించాడు ఆయన.అందకే లవ్ ఇన్ ఆంధ్రా అనే సినిమా తీసి సప్తస్వరాలు అనే సినిమాకు పోటీగా బరిలో దింపాడు.ఈ సినిమాలో క్రిష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు.
సప్తస్వరాలు, లవ్ ఇన్ ఆంధ్రా సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యాయి.అయితే ఈ రెండు సినిమాలు ప్రాంతీయ రంగు పులుముకున్నాయి.
కాంతారావు తెలంగాణ వ్యక్తి, క్రిష్ణ ఆంధ్రా వ్యక్తి కావడంతో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఈ సినిమాల మీద పడింది.తెలంగాణలో నైట్ షోలు రద్దు చేయడంతో కాంతారావు సినిమా సరిగా ఆడలేదు.
అటు ఆంధ్రాలో ఈయన తెలంగాణ వాడని అక్కడా నడవలేదు.రెండు చోట్లా కాంతరావుకు దెబ్బ తగిలింది.
సుమారు 6 లక్షల రూపాయలు నష్టపోయాడు.అటు క్రిష్ణ సినిమా లవ్ ఇన్ ఆంధ్రా మాత్రం బాగానే ఆడింది.
అలా తనకు తెలియకుండానే కాంతారావుకు తీవ్ర నష్టాన్ని తెచ్చాడు క్రిష్ణ.