ఖలిస్తాన్ వేర్పాటువాదుల కారణంగా ప్రస్తుతం భారత్ – కెనడాల ( India – Canada )మధ్య ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసులో అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మను( Sanjay Kumar Varma ) చేర్చడం కలకలం రేపింది.
అయితే ట్రూడో సర్కార్ తీరుతో కెనడాలోని సిక్కేతర కమ్యూనిటీలు వణికిపోతున్నాయి.ముఖ్యంగా హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇప్పటికే కెనడాలోని పలు హిందూ ఆలయాలు, సంస్థలపై ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే.కెనడియన్ హిందువులంతా తక్షణం కెనడాను ఖాళీ చేసి వెళ్లాలని గతంలో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్ధ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ ( Sikhs for Justice )సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు.
తాజా ఘటనల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని కెనడాలోని హిందువులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య ( Canadian MP Chandra Arya )దూకుడుగా వ్యవహరిస్తున్నారు.నవంబర్‌లో హిందూ వారసత్వ మాసంను పురస్కరించుకుని కెనడా పార్లమెంట్ వెలుపల హిందూ పతాకాన్ని ఎగురవేసి సంచలనం సృష్టించారు.రాజకీయాలలో ఎక్కువ మంది హిందూ కెనడియన్లు పాల్గొనాలని చంద్ర ఆర్య పిలుపునిచ్చారు.2022 నుంచి హిందూ వారసత్వ మాసంలో భాగంగా ఆయన హిందూ జెండాను ఎగురవేయడం ఇది మూడోసారి.హిందూ మత సాంస్కృతిక, మేధో, ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలుసుకోవడానికి వార్షికంగా ఈ మాసాన్ని జరుపుకుంటున్నారు.
కెనడాలో అత్యంత విజయవంతమైన కమ్యూనిటీలో హిందూ కెనడియన్లు ఒకరని చంద్ర ఆర్య తెలిపారు.ఇది కెనడాలో మూడవ అతిపెద్ద మత సమూహమని ఆయన వెల్లడించారు.2022లో తొలిసారిగా జెండాను ఎగురవేసినప్పుడు చెప్పినట్లుగా, కెనడాలో హిందువులకు కొత్త శకం ప్రారంభమైందని చంద్ర ఆర్య ట్వీట్‌లో పేర్కొన్నారు.కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింతగా పాలు పంచుకోవాలని తోటి హిందువులకు ఆయన పిలుపునిచ్చారు.