నేటి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారు.
ఈ ఆన్ లైన్ లావాదేవీల వలన ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో అన్నే అప్రయోజనాలు కూడా ఉన్నాయి.సైబర్ అటాక్స్ సంఖ్య ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.
అమాయకుల నుంచి డబ్బులను కొట్టేస్తూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.అందినకాడికి దోచుకుంటూ అమాయకుల కడుపులు కొడుతున్నారు.
ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఆన్ లైన్ వినియోగదారులను అప్రమత్తం చేసినా కానీ సైబర్ కేటుగాళ్లు మాత్రం కొత్త పద్ధతుల్లో డబ్బులు కొట్టేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.ఈ సైబర్ నేరాలను పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసినా కానీ ఈ నేరాల సంఖ్య తగ్గడం లేదు.
చెప్పాలంటే రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.ఎంతో మంది అమాయకుల సైబర్ నేరస్తుల వలలో పడుతున్నారు.
తాము ఎంతో కష్టపడి, కడుపు కట్టుకుని సంపాదించిన సొమ్మును కోల్పోతున్నారు.
ఇటువంటి సైబర్ నేరాల గురించి వాటి బారిన పడకుండా ఉండడం గురించి కేంద్ర ప్రభుత్వం సైబర్ దోస్త్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది.
అందులో సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఉండేందుకు ఏం ఏం చేయాలనే విషయాల గురించి తాజాగా కొన్ని సూచనలను చేసింది.ఈ సూచనల ప్రకారంగా నడుచుకుంటే సైబర్ నేరస్తుల నుంచి తప్పించుకోవచ్చునని డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చునని తెలియజేసింది.
మీరు కనుక ల్యాప్ టాప్ లేదా ఫోన్ లో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నపుడు వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయొద్దని దోస్త్ తెలియజేసింది.కొంత మంది ఆ లింకులను క్లిక్ చేసి వారి పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సమాచారాన్ని పంచుకుంటున్నారని తెలియజేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని దోస్త్ ప్రకటించింది.