కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారాలో సోమవారం జాత్యహంకార పెయింటింగ్ వేసిన ఘటన అమెరికాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ సంఘటనపై సిక్కు సమాజం మండిపడటంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది.
శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి ఆరెంజ్‌వాలేలో ఉన్న గురు మానేయో గ్రంథ్ గురుద్వారా సాహిబ్ ఎదురుగా ఉన్న కాంక్రీట్ స్లాబ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు వైట్ పవర్ అని రాయడంతో పాటు స్వస్తిక్ గుర్తును రాశారు.ఈ ఘటనపై ఎఫ్‌బీఐతో పాటు శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది.
పక్షపూరిత నేరం జరిగినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిటెక్టివ్‌లు ఘటనా ప్రదేశాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారని గురుద్వారా ప్రతినిధి హర్బన్స్ సింగ్ స్రాన్ తెలిపారు.ద్వేషపూరిత నేరాలపై దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నియమించబడిన డిటెక్టివ్‌లు సోమవారం ఉదయం నుంచి దర్యాప్తు చేస్తున్నారని శాక్రమెంటో షెరీఫ్ డిప్యూటీ లేసి నెల్సన్ పేర్కొన్నారు.దర్యాప్తు అధికారులు ఘటనాస్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడంతో పాటు స్థానికులను ప్రశ్నిస్తున్నారు.గురుద్వారాకు దగ్గరలో దొరికిన సీసీటీవీ ఫుటేజ్‌ను డిటెక్టివ్‌లు విశ్లేషిస్తున్నారు.కాగా ఈ విద్వేష ఘటనకు సంబంధించి గురుద్వారాకు దేశంలోని ఇతర వర్గాల కూడా అండగా నిలిచాయి.