చిన్న చిన్న సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు కంపెనీలకు పెను సమస్యలను తీసుకొస్తూ ఉంటాయి.తాజాగా ఫేస్‌బుక్ విషయంలో ఇలాగే జరిగింది.
ట్రాన్స్‌లేషన్‌లో సమస్య కారణంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరు తప్పుగా ప్రచురితమవ్వడంతో ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పింది.
వివరాల్లోకి వెళితే… జీ జిన్‌పింగ్ ప్రస్తుతం మయన్మార్ పర్యటనలో ఉన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో బర్మీస్ భాషలో పోస్ట్ చేశారు.దీని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో జిన్‌పింగ్ పేరు కాస్త ‘‘మిస్టర్ షిట్‌హోల్’’గా కనిపించింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఫేస్‌బుక్ స్పందించింది.తమ నుంచి జరిగిన ఈ తప్పిదానికి ఆ సంస్థ యాజమాన్యం చైనా అధినేత కు క్షమాపణలు తెలిపింది.
సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించామని, మరోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది.
ఆ సమయంలో బర్మీస్ భాషలో పెట్టిన పోస్టులు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో తప్పుగా చూపించాయి.దీంతో ఫేస్‌బుక్ నష్టనివారణా చర్యలు చేపట్టింది.2018లో బర్మీస్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఆప్షన్‌ను ఎఫ్‌బీ తొలగించింది.తాజాగా మళ్లీ ఈ ఆప్షన్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.