మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కేంద్ర అధికార పార్టీ బిజెపి బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఈ మేరకు తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది .
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో, ఎంపీ స్థానాల్లోనైనా తమపట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో కేంద్ర బీజేపీ పెద్దలు ఉన్నారు.ఈ మేరకు ఢిల్లీ బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda) సమక్షంలో తెలంగాణ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి చంద్రశేఖర్ , సునీల్ బన్సల్ , బిజెపి సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివ ప్రకాష్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి , సీనియర్ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, డికె అరుణ, జితేందర్ రెడ్డి ,ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 17 లోకసభ స్థానాల్లో నలుగురు సిట్టింగ్ అభ్యర్థులు ఉండగా, మిగతా 13 స్థానాల్లో ఎవరిని పోటికి దించాలనే విషయం పైన ప్రధానంగా చర్చించారు.అదిలాబాద్( Adilabad) స్థానంపై ఎంపీ సోయం బాపూరావు( Soyam Bapu Rao )తో పాటు , మరికొంతమంది పేర్లను పరిశీలించారు.మిగతా స్థానాల్లో ఒక్కో స్థానానికి మూడు నుంచి ఐదు మంది వరకు పోటీ పడుతుండడంతో , వీరిలో ఎవరిని పోటీకి దించాలని విషయం పైన చర్చించారు.
మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ , జితేందర్ రెడ్డి ఇద్దరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో , వీరిలో ఒకరి పేరును ఫైనల్ చేయనున్నారు.మల్కాజిగిరి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.
మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా, జాతీయ నేతల్లో మురళీధర్ రావు పేరు కూడా వినిపిస్తోంది.
మల్కాజిగిరి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతి మల్కా కొమరయ్య( Komaraiah ) పేరును బిజెపి అధిష్టానం పరిశీలిస్తుంది.జహీరాబాద్ నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి, సురేష్ రెడ్డి తో పాటు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబం లో ఒకరి పేరు వినిపిస్తోంది .అలాగే ఇదే నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.గెలుపు గుర్రాలకి టిక్కెట్ ఇస్తామని, ఈ విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్ళమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలోనే తేల్చి చెప్పారట.