గుజరాత్‌లోని సూరత్( Surat )లో దారుణం జరిగింది.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసులు వాహనాల తనిఖీని ఇటీవల కాలంలో బాగా ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు ఈ నెల 4వ తేదీన స్కోడా కారును ఆపేందుకు ప్రయత్నించారు.అయితే డ్రైవర్ కారును ఆపకుండా పోలీసును ఢీకొట్టాడు.
అనంతరం బానెట్‌పై ఉన్న పోలీసును సుమారు 400 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు.హృదయ విదారకమైన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డైంది.
ఈ ఘటన సూరత్‌లోని కతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి ఓవర్ బ్రిడ్జి వద్ద జరిగింది.రాత్రి వేళల్లో రోడ్డుపై తెల్లటి రంగు కారు వేగంగా దూసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.బానెట్‌కు వేలాడుతున్న ఓ పోలీసు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
రోడ్డుపై సర్కిల్ దగ్గర కారు స్పీడ్ బ్రేకర్ దూకగానే బానెట్‌పై వేలాడుతున్న పోలీసు కిందపడిపోయాడు.కారు డ్రైవర్ చేసిన ఈ ప్రమాదకరమైన చర్యను చూసి వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఇతర పోలీసులు పరుగులు తీశారు.గాయపడిన పోలీసును వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసును బానెట్‌పైకి ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.అలాగే కారును కూడా సీజ్ చేశారు.
దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని వాహనాల చెకింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సూరత్ ఏసీపీ ఝాల తెలిపారు.
ఈ క్రమంలో అల్కాపురి బ్రిడ్జి కింద కాటర్గాం పోలీస్‌స్టేషన్ బృందం వాహనాలను తనిఖీ చేస్తోందని, ఇంతలో తెల్లటి స్కోడా కారు నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్లడం పోలీసులు గమనించారని చెప్పారు.ఆపమని సిగ్నల్ ఇచ్చినా డ్రైవర్ వేగం పెంచాడని పేర్కొన్నారు.
పోలీసు గౌతమ్ జోషిని కారుతో ఢీకొట్టి, బానెట్‌పై ఉన్న అతడిని 400ల మీటర్లు ఈడ్చుకెళ్లాడని తెలిపారు.దీనిపై కతరగాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.కారు డ్రైవర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.