తెలంగాణలో కాంగ్రెస్ 72 స్థానాలపై గురిపెట్టిందా ? వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలవనుందా ? అసలు కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ ఏంటి ? అనే ప్రశ్నలు ప్రస్తుతం హస్తం పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి.ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 72 స్థానాల్లో గెలుపొందుతుందని, బిఆర్‌ఎస్ కేవలం 25 సీట్లకే పరిమితం అవుతుందని, బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 72 స్థానాలు సాధ్యమేనా ? అది కేవలం ఊహాజనితమేనా అనే ప్రశ్నలు తలెత్తాక మానవు.ఎందుకంటే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి నెలకొంది.ఆ పార్టీలోని సీనియర్ నేతలకు మరియు రేవంత్ రెడ్డికి మద్య ఆదిపత్య వివాదం జరుగుతూనే ఉంది.
సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తుండడం అలాగే రేవంత్ రెడ్డి కూడా సీనియర్స్ కు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.ఇలా అంశాలు ఆ పార్టీని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి.
దాంతో హస్తం పార్టీలో ఎవరికివారే అన్నట్లుగా సాగుతోంది ఆ పార్టీ నేతల వ్యవహారం.ఫలితంగా పార్టీ బలహీన పడుతూ వచ్చింది.
హస్తం పార్టీ ఎంతలా బలహీన పడిందంటే కాంగ్రెస్ కంచుకోటగా ఉండే మునుగోడులో సైతం ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
అలాగే పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీని విడిచి ఇతర పార్టీల గూటికి చేరుతున్నారు.దాంతో పార్టీని నియోజిక వర్గాల వారీగా బలహీన పడుతూ వచ్చింది.ఇదే సమయంలో భారత జనతా పార్టీ తెలంగాణలో బలం పెంచుకుంటూ వచ్చింది.
ఫలితంగా కాంగ్రెస్ మూడవ స్థానానికి పడిపోగా, బీజేపీ రెండవ స్థానానికి చేరుకుంది.దాంతో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా 72 సీట్లు సాధ్యమేనా అంటే కష్టమే అని చెప్పాలి.మరి రేవంత్ రెడ్డి చెబుతున్న జోష్యం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.