కెనడాలోని ఒక సబ్‌వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి.సిక్కు వ్యక్తి తలపై కొట్టాడు.
దీంతో అతని తలపాగా నేలపై పడింది.గత వారం బ్లూర్ యోంగే టొరంటో ట్రాన్సిట్ కమీషన్ (టీటీసీ) సబ్‌వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.నిందితుడు టీటీసీ స్టేషన్ నుంచి బయల్దేరే ముందు బాధితుడిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని టొరంటో పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే బాధితుడి గుర్తింపు, వయస్సు ఇతర వివరాలను పోలీసులు విడుదల చేయలేదు.అనుమానితుడు చివరిసారిగా నీలిరంగు టోపీ, నలుపు రంగు జాకెట్ ధరించి నల్లటి బ్యాగ్‌తో కనిపించాడు.
స్పెషలైజ్డ్ హేట్ క్రైమ్ యూనిట్‌తో సంప్రదించిన తర్వాత.దీనిని ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నట్లు టొరంటో పోలీసులు తన ప్రకటనలో తెలిపారు.ఈ ఘటనపై టొరంటో మేయర్ జాన్ టోరీ మాట్లాడుతూ.సబ్ వే స్టేషన్‌లో జరిగిన ద్వేషపూరిత దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ట్రాన్సిట్ సిస్టమ్‌తో పాటు నగరంలోని ప్రదేశాలు సురక్షితంగా వుంచాలన్నారు.నగరంలో ద్వేషానికి స్థానం లేదని, వివక్ష, హింసకు వ్యతిరేకంగా మనమందరం నిలబడాలని మేయర్ పిలుపునిచ్చారు.
అటు టొరంటో ట్రాన్సిట్ కమీషన్ కూడా విచారణలో పోలీసులకు సహకరిస్తామని తెలిపింది.
ఇకపోతే.కెనడాలో నానాటికీ విద్వేషదాడులు తీవ్రమవుతోన్న నేపథ్యంలో ఆ దేశంలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే.స్టాటిస్టిక్స్ కెనడా అందించిన డేటా ప్రకారం 2014 నుంచి దేశంలో మొత్తం ద్వేషపూరిత నేరాల సంఖ్యలో 159 శాతం పెరుగుదల నమోదైంది.
ఆగస్ట్‌లో స్టాటిస్టిక్స్ కెనడా ప్రచురించిన నివేదిక ప్రకారం… టొరంటో (779), వాంకోవర్ (429), మాంట్రియల్ (260), ఒట్టావా (260), కాల్గరీ, (139) నగరాలలో 2021లో అత్యధిక సంఖ్యలో ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.అలాగే జాతి ఆధారిత విద్వేషనేరాలు కూడా 2014 నుంచి పెరిగాయి.ఈ తరహా నేరాలలో 182 శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.2020 నుంచి ద్వేషపూరిత నేరాలలో 27 శాతం పెరుగుదల నమోదైంది.
కెనడియన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ కమ్యూనిటీ సేఫ్టీ స్టాటిస్టిక్స్ నివేదిక 2021 ప్రకారం.యుకాన్ మినహా మిగిలిన అన్ని కెనడా ప్రావిన్సుల్లోనూ ద్వేషపూరిత నేరాలు పెరిగినట్లు నివేదించింది.మతం (67 శాతం పెరుగుదల), లైంగిక వివక్ష (64 శాతం పెరుగుదల) లక్ష్యంగా చేసుకుని కూడా ద్వేషపూరిత నేరాలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.జాతి విద్వేష నేరాలకు సంబంధించి 2021లో దక్షిణాసియా జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఘటనల్లో 21 శాతం పెరుగుదల నమోదైంది.2019లో ఈ తరహా ఘటనలు 81 శాతం పెరిగితే.2021లో అవి 164 శాతం పెరిగాయి.ఇక అరబ్ లేదా పశ్చిమాసియా జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు 46 శాతం, ఆగ్నేయాసియాను జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు 16 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.