కామన్వెల్త్ బ్యాంక్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్‌క్లూజన్ సిరీస్‌లోని ఓపెనింగ్ వన్డే ఇంటర్నేషనల్ (ODI)లో ఆస్ట్రేలియా బ్లైండ్ క్రికెటర్ స్టెఫాన్ నీరో చరిత్ర సృష్టించాడు.ఈ ప్లేయర్ కేవలం ఒకే వన్డే మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసి క్రికెట్ ఆటలో కనీవినీ ఎరుగని రికార్డు నెలకొల్పాడు.
నీరోకు పుట్టుకతో వచ్చే నిస్టాగ్మస్ ఉంది.అంటే అతని మెదడు తన కళ్లు ఏమి చూస్తున్నాయో స్పష్టంగా తెలుసుకోలేదు.
అలా మెదడు సరిగా సిగ్నల్స్ ఇవ్వకపోవడం వల్ల అతడికి దృష్టిలోపం ఉంది.అయినా కూడా అరుదైన రికార్డు సృష్టించి అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
ఈ అంధుల వన్డే క్రికెట్ బ్రిస్బేన్ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.
ఈ తొలి వన్డేలో బ్యాటర్ స్టెఫాన్ నీరో మూడు గంటలు క్రీజ్‌లో ఉండి కేవలం 140 బాల్స్ ఆడి ఏకంగా 49 ఫోర్లు, ఒక సిక్సర్ బాది చాలా వేగంగా 309 పరుగులు చేశాడు.
అంతేకాదు అతడు అజేయంగా నిలిచి వావ్ అనిపించాడు.ఒకే ప్లేయర్ ఇలా భారీ స్కోరు సాధించడంతో ఆసీస్ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 542 స్కోరు నమోదు చేసింది.
ఇంతటి భారీ స్కోరు చేధించడానికి బరిలోకి దిగిన కివీస్ దారుణంగా విఫలం అయ్యింది.ఈ జట్టు కేవలం 272 పరుగులకే ఆల్ ఔట్ అయింది.దీంతో ఆసీస్ టీమ్ 270 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించినట్లు అయింది.
పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో దృష్టి లోపం ఉన్న క్రికెటర్లలో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ గా స్టెఫాన్ నీరో నిలిచాడు.
బ్లైండ్ క్రికెట్లో పాకిస్థాన్‌కు చెందిన మసూద్ జాన్ చేసిన 264 నాటౌట్ స్కోరు హైయెస్ట్ స్కోరుగా ఉండేది.ఇప్పుడు దానిని చెరిపేసి నీరో చరిత్ర లిఖించాడు.ఆసీస్ క్రికెటర్లు అయిన మాథ్యూ హేడెన్, మైఖేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ ఇప్పటికే ట్రిపుల్ సెంచరీ చేసి ఆశ్చర్యపరిచారు.అలాంటి దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో నీరో కూడా చేరాడు.
దీంతో క్రికెట్ అభిమానులు అందరూ నీరోని ఉద్దేశిస్తూ “ఈ క్రికెటర్ బ్లైండ్ కానీ ట్రైన్డ్” అని వ్యాఖ్యానిస్తున్నారు.