ఎక్కువ మంది పెంచే పెంపుడు జంతువుల్లో పిల్లులు ముందు వరుసలో ఉంటాయి.ప్రపంచవ్యాప్తంగా ఎవరింట్లో చూసినా కుక్కలు, పిల్లులు కనిపించడం సర్వసాధారణమే.
ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి ఏ దేశంలోనైనా ఎవరైనా సరే పెంపుడు జంతువులను భేషుగ్గా పెంచుకోవచ్చు.కానీ తాజాగా ఇరాన్ ప్రభుత్వం ఒక వివాదాస్పద బిల్లు తీసుకొచ్చింది.
పిల్లులను పెంచడానికి వీల్లేదు అని ఇరాన్ దేశంలోని 75 మంది శాసనసభ్యులు ఒక బిల్లును ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదిత చట్టాన్ని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా జంతు ప్రేమికులు ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వంపై ఇంటాబయటా అక్షింతలు పడుతున్నాయి.అటవీ, హానికరమైన జంతువులని బ్యాన్ చేస్తామని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది.
కానీ నివేదికల ప్రకారం ఆ జంతువుల్లో కుక్కలు, పిల్లులు, పాములు, ఎలుకలు ఇలా మనుషులు పెంచుకునే జంతువులు చాలానే ఉన్నాయి.వీటన్నిటినీ దేశంలో బ్యాన్ చేస్తే చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఇరాన్ ప్రభుత్వం ప్రకారం, అపరిశుభ్రమైన జంతువులు దేశాన్ని, మనుషులను కలుషితం చేస్తున్నాయి.

వీటిని పెంచే మనుషులు సమాజానికి విధ్వంసకర సమస్యగా మారుతున్నారు.పెంపుడు జంతువులు మానవులకు హాని చేస్తున్నాయి.అందుకే పెంపుడు జంతువులను పెంచడం, విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించాలని ఇరాన్ నాయకులు భావిస్తున్నారు.
ఈ మేరకు ‘ప్రొటెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ రైట్స్ ఎగైనెస్ట్ యానిమల్స్’ అనే ఒక చట్టాన్ని ప్రతిపాదించారు.ఇప్పటివరకైతే ఈ చట్టానికి ఆమోదముద్ర పడలేదు.ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే.ఇరాన్ దేశంలో పెంపుడు జంతువులు అన్నీ మాయమయ్యే పెద్ద ప్రమాదం వస్తుంది.
ఈ బిల్లు అక్కడి పెంపుడు జంతువులకు శాపమనే చెప్పాలి.