జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తా ఏమిటో మరోసారి అర్థమైపోయింది.నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ పండగ చేసుకున్నారు.
రాజకీయ ప్రముఖులు, సినిమా రంగానికి చెందిన వారు ఇలా ఎంతోమంది శుభాకాంక్షలతో తమ అభిమానంతో పవన్ ను ముంచెత్తారు.అసలు ఒక సినీనటుడు కానీ, రాజకీయ నాయకుడికి ఈ స్థాయిలో క్రేజ్ ఉంటుందా అనేది అందరికీ అర్థమైంది.
అయితే ఈ అభిమానాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో కాస్త కంగారు పడుతున్నట్టు కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికారు.
అప్పుడే పవన్ ఆ రెండు పార్టీలతో ఒక అంగీకారానికి వచ్చి కొన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా పవన్ తో పాటు , మరికొంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు.
కానీ పవన్ ఆ విధంగా చేయలేదు.2019 ఎన్నికల్లో బిఎస్పి వంటి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా ఘోర పరాజయం ఎదురైంది.ఇక ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకు వెళ్లే విషయంలోనూ తడబాటుకు గురవుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
అది కాకుండా పవన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, అక్కడే బిజీ అయిపోయారు.రాజకీయంగా యాక్టివ్ గా ఉందాం అనుకున్న సినిమా షెడ్యూల్ కారణంగా వీలుపడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన తరపున రోడ్ల సమస్యపై సోషల్ మీడియా ద్వారా పోరాటం చేస్తున్నారు.ప్రజలలోను రోడ్ల సమస్య పై తీవ్ర అసంతృప్తి ఉండడంతో, దానిని జనసేన బాగానే వాడుకుంటోంది.
అయితే క్షేత్రస్థాయిలో పవన్ దీనిపై పోరాటానికి దిగితే ఆ ఫలితం వేరేగా ఉంటుంది.ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతోంది.ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం రాజకీయంగా బాగా యాక్టివ్ అయింది.టిడిపి అధినేత చంద్రబాబు బస్సు యాత్ర , ఆయన కుమారుడు లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.రెండున్నరేళ్లలో బాగా పట్టు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదల టిడిపిలో కనిపిస్తోంది.
ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో అన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేపడుతూ, స్వయంగా పవన్ రంగంలోకి దిగితే పరిస్థితి వేరేగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో జనసేన కనుక గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడమో, అధికారంలోకి రావడమో జరగాలి.
అలా కాకుంటే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు.