బీజేపి ఆధ్వర్యంలో వచ్చే నెల 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఈ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నట్టు ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.
ముఖ్యంగా సిఏఏ పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తుండటం, ప్రజల్లో కూడా దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రజలకు అర్థమయ్యే విధంగా దీని గురించి చెప్పాలని బిజెపి భావిస్తోంది.ఈ మేరకు ఈ సభను విజయవంతం చేయడానికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
సీఏఏ బిల్లు దేశంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టేందుకు కాదు అని చెప్పేందుకు బిజెపి ఈ సభ ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తోంది.
అందుకే తెలంగాణ లో నిర్వహించబోయే ఈ సభకు జాతీయవాదులు అందరిని బిజెపి ఆహ్వానిస్తోంది.ముఖ్యంగా ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అనేది సందేహంగా మారింది.ఎందుకంటే కొద్ది రోజులుగా ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, తన శత్రువైన జగన్ తో బిజెపి సన్నిహితంగా ఉండడం పవన్ కు ఏమాత్రం ఇష్టం లేదు.
అయినా రెండు రోజుల క్రితం కర్నూల్ లో జరిగిన ర్యాలీలో బిజెపి, జనసేన కలిసి పాల్గొన్నాయి.తెలంగాణలో బీజేపీ నిర్వహించే సభలో ఖచ్చితంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ ప్రసంగాలు సాగుతాయి.
ఆ సభలో ఖచ్చితంగా పవన్ కూడా కెసిఆర్ ప్రస్తావన తీసుకు రావాల్సి ఉంటుంది.
కేసీఆర్ కు పవన్ కు మధ్య ప్రస్తుతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అంతే కాకుండా పవన్ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ పై రాజకీయ విమర్శలు చేస్తే, తాను నటిస్తున్న సినిమాల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని పవన్ భావిస్తున్నారు.
అందుకే ఈ సభలో పాల్గోవాలా వద్దా అనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.పాల్గొనాల్సి వస్తే కేసీఆర్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండాలని పవన్ ఆలోచిస్తున్నాడట.
ఇక బీజేపీ అయితే తెలంగాణలో పవన్ కు ఉన్న ఇమేజ్ కారణంగా ఈ సభ మరి అంత సక్సెస్ అవుతుందని భావిస్తోంది.అయితే ఈ సభకు పవన్ హాజరు అవుతారా లేదా అనేది చివరి నిమిషం వరకు సస్పెన్సు కలిగించే అంశంగానే కనిపిస్తోంది.