పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కలకలం రేగింది.ప్రాజెక్టు వెళ్లే రోడ్డుకు పగుళ్లు ఏర్పడడంతో ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శనివారం రహదారికి భారీగా బీటలు ఏర్పడటంతో … పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న సుమారు పది లారీలను డ్రైవర్లు అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీశారు.ఆ రోడ్డు సమీపంలో మట్టి తవ్వుతున్న జెసిబి కొంతభాగం భూమిలోకి కూరుకుపోయింది.
రోడ్డు సుమారు పది అడుగులకుపైగా పైకి పొంగడంతో ఆ ప్రాంతంలో భూకంపం సంభవించిందని వదంతులు వ్యాపించాయి.పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ పరిణామాలకు భూకంపం కారణం కాదని, ప్రకంపనలు ఏవి ఈ ప్రాంతంలో చోటుచేసుకోలేదని ప్రాజెక్టు ఇంజి నీర్లు స్పష్టం చేశారు.భూమిలో హీట్ ఆఫ్ హైడ్రేషన్ వల్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు.స్పిల్ ఛానల్ కోసం మట్టి తరలించడానికి వేసిన రోడ్డు మార్గంలో కొండరాళ్లు, మట్టి బరువెక్కడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల పక్కనే ఉన్న ఈ రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డా యని వివరణ ఇచ్చారు.పోలవరం చెక్‌పోస్టు ప్రాంతంలో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఎగువనున్న గిరిజన గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
దీంతో డైవర్షన్ రోడ్డు పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.