ఏపీ అధికారపక్షం వైసీపీలో ఏదో ఒక జిల్లాలో రోజుకో సరికొత్త వివాదం తెరమీదకు వస్తోంది.పార్టీ పరిశీలకులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఎన్ని సర్దుబాట్లు చేస్తున్నా రోజుకో గొడవ వస్తుండడంతో ఏం చేయాలో తెలియడం లేదు.
తాజాగా పార్టీలో వివాదాలకు దూరంగా ఉంటారని పేరున్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీలో ఓ సీనియర్ నేతను టార్గెట్‌గా చేసుకుని హోం మంత్రి సుచరితకు లేఖ రాయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.పిల్లి బోస్ అంటే జగన్‌కు ఎంత విధేయుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
గత ఎన్నికల్లో బోస్ మండపేటలో ఓడినా కూడా జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరీ తన కేబినెట్లోకి తీసుకున్నారు.ఇక ఈ యేడాది రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు.
బోస్ జీవితంలో ఈ రెండేళ్లలోనే అనూహ్యమైన మార్పులు జరిగాయి.ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీ, మంత్రి కావడం.
ఇప్పుడు ఏకంగా రాజ్యసభకు ఎంపిక కావడం గొప్ప విషయమే.అలాంటి బోస్ తాజా పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సుచరితకు లేఖ రాయడం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపిన దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని కోరడంతో పాటు ఈ కేసులో ఏ 1గా తోట త్రిమూర్తులు ఉన్నారని చెప్పారు.త్రిమూర్తులు ఈ కేసును ఇరవై ఏళ్లుగా ఎటూ తేలకుండా గేమ్ ఆడుతున్నారని.దళితులకు తోట త్రిమూర్తులతో పోరాడే తెలివి తేటలు లేవని పిల్లి తన లేఖలో పేర్కొన్నారు.అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నం జరుగుతుందని కూడా బోస్ ఆరోపించారు.
వాస్తవంగా తోట, బోస్ ఇద్దరు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయ శత్రువులుగా ఉన్నారు.గత ఎన్నికల్లో తోట టీడీపీ నుంచి ఓడి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు.
ప్రస్తుతం తోట అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.అయినా వీరి మధ్య పాత పగలు అలాగే ఉన్నాయి.ఈ సమయంలో తోటను టార్గెట్‌గా చేసుకుని పిల్లి ఏకంగా హోం మంత్రికి లేఖ రాయడంతో తోట ఇరుకున పడ్డట్లయ్యింది.ఈ వివాదం ఎప్పటకి ముగుస్తుందో ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.