‘ఏమాయ చేశావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత, అదే సినిమాతో నాగచైతన్యకు సక్సెస్‌ను ఇచ్చింది.ఆ సినిమా తర్వాత ‘మనం’ చిత్రంలో వీరిద్దరు నటించారు.
ఆ సినిమాలో నిజమైన భార్య భర్తల మాదిరిగా కనిపించి వావ్ అనిపించారు.మనంతో ఇద్దరి మద్య ప్రేమ మరింత పెరిగి పెళ్లికి తెర తీశారు.
నాగచైతన్య, సమంతలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు కలిసి నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు ‘మజిలీ’ రూపంలో వారి కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి ఈ మజిలీ ఎలా ఉందో ఈ విశ్లేషణలో చూసేద్దామా.
నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, అతుల్ కులకర్ణి, సుబ్బరాజు
దర్శకత్వం : శివ నిర్వాన
నిర్మాణం : సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం : గోపీ సుందర్, థమన్
కథ:
క్రికెట్ ప్రాణంగా, స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడుపుతున్న పూర్ణ(నాగచైతన్య)కు నావీ ఆఫీసర్ కూతురు అన్షు(దివ్యాన్ష కౌశిక్) పరిచయం అవుతుంది.ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.ఆ ప్రేమ విఫలం అవ్వడం పూర్ణ క్రికెట్‌కు దూరం అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లి పోతాడు.
ఆ సమయంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడితో శ్రావణి(సమంత)ని వివాహం చేసుకుంటాడు.శ్రావణిని పెళ్లి చేసుకున్నా కూడా ఆమెతో ప్రేమగా ఉండలేడు.ఏమాత్రం బాధ్యత లేకుండా పనీ పాట లేకుండా శ్రావణి సంపాదనపై బతుకుతూ ఉంటాడు.చివరకు పూర్ణ బాధ్యతను తెలుసుకుని, శ్రావణిపై ఎలా ప్రేమ కలుగుతుంది? అసలు పూర్ణ మొదటి ప్రేమ కథ ఏంటీ? పూర్ణ గురించి అన్ని విషయాలు తెలిసిన శ్రావణి అతడిని పెళ్లి చేసుకునేందుకు ఎందుకు ఒప్పుకుంది? అనే విషయాలను దర్శకుడు చాలా ఆసక్తికరంగా చూపించాడు.సినిమా చూసి కథలోని సస్పెన్స్ పాయింట్స్‌ను తెలుసుకోండి.
నటీనటుల నటన:
నాగచైతన్య రెండు విభిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించాడు.టీనేజర్‌గా మరియు కాస్త ఏజ్ అయిన వ్యక్తిగా నాగచైతన్య ఆకట్టుకున్నాడు.రెండు పాత్రల్లో కూడా జీవించేశాడని చెప్పుకోవచ్చు.
నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా చెప్పుకోవచ్చు.ఇక సమంత విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సినిమాలో సమంత కనిపించలేదు, శ్రావణి పాత్ర మాత్రమే కనపించింది.భర్త ప్రేమ కోసం పరితపించే పాత్రలో ఆమె అద్బుతంగా నటించింది.
రావు రమేష్ తండ్రి పాత్రలో అలరించాడు.పోసాని తనదైన శైలిలో మెప్పించాడు.
మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ ఉన్నంతలో ఆకట్టుకుంది.సినిమాలో నటించిన ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.
టెక్నికల్‌గా.
సినిమాటోగ్రఫీ బాగుంది.వైజాగ్ అందాలను సినిమాటోగ్రాఫర్ చక్కగా చూపించాడు.నాగచైతన్య మరియు సమంతల వయసు తగ్గించడంలో కూడా సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.సినిమా విడుదలకు ముందే పాటలకు మంచి స్పందన వచ్చింది.సినిమాలో అవి ఇంకాస్త బాగున్నాయి.
ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించింది.సినిమాలోని కొన్ని సీన్స్ లెంగ్తీగా అనిపించాయి.
వాటిని కాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.దర్శకుడు శివ నిర్వాన మొదటి సగంను ఇంకాస్త బెటర్‌గా, రెండవ సగంలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్‌ను పెంచి ఉంటే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది.
విశ్లేషణ:
గతంలో నిన్ను కోరి చిత్రంతో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీని చూపించిన దర్శకుడు శివ నిర్వాన ఆ సినిమాతో క్లాస్ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు.ఈ చిత్రంతో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్త మాస్ ఎలిమెంట్స్‌ను జోడించడం జరిగింది.సినిమాలో హీరో నాగచైతన్య మరియు సమంత పాత్రలను దర్శకుడు చూపించిన తీరు చాలా బాగుంది.రెండు ప్రేమ కథలను సమాంతరంగా చూపించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.
సినిమాలోని మొదటి సగంలో ఎంటర్ టైన్ మెంట్ బాగా వచ్చింది.అయితే రెండవ సగంలో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త తగ్గింది.
అయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది.అక్కినేని జంట కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన మజిలీ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది.
మరోసారి నాగచైతన్య, సమంత జోడీ సత్తా చాటింది.
ప్లస్ పాయింట్స్:
నాగ చైతన్య, సమంత, కథలో ట్విస్ట్‌లు, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే,
మైనస్ పాయింట్లు:
కొన్ని సీన్స్ కాస్త సాగతీసినట్లుగా ఉన్నాయి.
రేటింగ్ : 3/5
బోటం లైన్ : చైతూ, సామ్ అభిమానులకు ‘మజిలీ’ మస్త్ మజా ఇవ్వడం ఖాయం.