ఈ ప్రపంచంలోకి కంప్యూటర్లు దర్శనం ఇచ్చాక దాదాపు అన్ని ఆఫీసుల్లో ప్రింటర్ల వాడకం అనేది విపరీతంగా పెరిగింది.ఒకసారి ప్రింట్ చేసిన కాగితాన్ని మళ్లీ వాడుకునే అవకాశం లేకపోవడంతో కాగితాల వినియోగం అనేది విరివిగా మారింది.
ఈ క్రమంలో కాగితం వినియోగాన్ని తగ్గించేందుకు, కాగితానికి రెండువైపులా ముద్రించే ప్రింటర్లను నిపుణులు తయారు చేశారు.వీటివల్ల కాగితాల వాడకం 50% తగ్గింది.
అయితే కాగితాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, ప్రింట్ చేసిన కాగితాలను మరలా ఉపయోగించేలా ఇజ్రాయెల్ లోని ‘రీప్’ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుత సాధనాన్ని ఒకదానిని రూపొందించారు.
అవును, ఈ పరికరం ద్వారా అచ్చేసిన కాగితాన్ని ఎన్నిసార్లు అయినా వాడొచ్చని చెబుతున్నారు నిపుణులు.
అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి! ఇది ప్రింటర్ల మాదిరిగానే కనిపిస్తుంది గాని, ప్రింటర్ కాదు.దీనిని డీప్రింటర్ అని అంటారు. అంటే ప్రింట్ చేసిన కాగితం మీద ఉన్న ఇంకును పూర్తిగా పీల్చేసుకుని, క్షణాల్లోనే కాగితాన్ని మళ్లీ తెల్లగా మార్చేస్తుందన్నమాట.ఈ డీప్రింటర్ ద్వారా ఇలా ఒక్కో కాగితాన్ని దాదాపు 10 సార్లు వాడుకునే వెసులుబాటు కలదు.
అయితే, డీప్రింటర్ ద్వారా అలా కాగితాలను మరలా మరలా వాడుకోవాలంటే, దానికి సాధారణ కాగితాలు పనికిరావని చెబుతున్నారు.ఇంకును పీల్చుకోని విధంగా ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను మాత్రమే ఈ డీప్రింటర్లో వాడుకోవాల్సి ఉంటుంది.కాగితాలను రీసైక్లింగ్ చేయడం కాకుండా ప్రింటర్లో ఒకసారి అక్షరాలను ముద్రించేసిన కాగితాలను ఒకటికి 10 సార్లు వాడుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.సాధారణంగా రీసైక్లింగ్ చేయబడిన కాగితాలను టిష్యూలు, టాయిలెట్ పేపర్లు, న్యాప్కిన్లు, వార్తపత్రికలలో వాడుతారు.
ఇక డీప్రింటర్ వాడకం గాని పెరిగితే, కాగితాల వాడకాన్ని దాదాపుగా తగ్గించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.