సవాళ్లు , ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదే పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ( Arikepudi Gandhi )మధ్య చోటు చేసుకున్న వివాదం రోజురోజుకు ముదురుతోంది.
ఈ వ్యవహారం కాస్తా.కీలక నేతలంతా హౌస్ అరెస్ట్ అయ్యేలా చేసింది.
హైదరాబాద్ తో సహా తెలంగాణలోని చాలాచోట్ల బీఆర్ఎస్ కీలక నాయకులను, పోలీసులు గృహ నిర్బంధం చేశారు.అరికెపూడి గాంధీ తో పాటు, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
పార్టీ మారిన వారికి చీర, గాజులు కౌశిక్ రెడ్డి పంపించారు.చీరా గాజులు వేసుకుని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ కౌశిక్ రెడ్డి హితవు పలకడంతో పాటు, వారికి అసలు ఇజ్ఞత్ లేదు అంటూ విమర్శలు చేశారు.
ముఖ్యంగా కడియం శ్రీహరి , దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి , డాక్టర్ ఎం సంజయ్ కుమార్ , కాలే యాదయ్య , బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలను ఉద్దేశించి చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి .వీరిపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్ పై హైకోర్టు వెల్లడించిన తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.
కడియం శ్రీహరి( Kadiyam Srihari ) పచ్చి మోసగాడు, దానం నాగేందర్ బిచ్చగాడు అంటూ కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. దానం నాగేందర్ గతంలో అనేక పార్టీలు మారారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు నిలిచారు .ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బషీర్ బాద్ లోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి .నేడు ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది .మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఈ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హరీష్ రావు( Harish Rao )తో పాటు , బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి, వారిని గృహ నిర్బంధంలోనే ఉంచారు.ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను మరింత రచ్చ చేస్తున్నాయి.