యాదాద్రి భువనగిరి జిల్లా: గత పార్లమెంట్ సర్వత్రిక ఎన్నికల్లో సారు…కారు… పదహారు…అనే నినాదంతో ముందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎదురుగాలి వీస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.భువనగిరి లోక్ సభ స్థానం నుండి అభ్యర్ధిగా నిలబడేందుకు పింక్ పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో సారు…కారు…బేజారు.
అనే స్థితికి చేరుకుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.గులాబీ పార్టీకి తిరుగులేదని భావించిన అధినేత కేసీఆర్ కు భువనగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు కరువై బుర్ర హీటెక్కేస్తుందని గులాబీ క్యాడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం,పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడం కారు పార్టీకి కలవరం కలిగించే విషయమేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇబ్రహీంపట్నం, మునుగోడు,భువనగిరి, నకిరేకల్,తుంగతుర్తి,ఆలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో ఎమ్మేల్యే స్థానాలకు కైవసం చేసుకోగా,జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వల్ప మెజారిటీతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై గెలుపొందినవిషయం తెలిసిందే.
ఆయన కూడా అక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరిలో గతంలో గెలుపొందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో విభేదించి బీజేపీలో చేరారు.ప్రస్తుత బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఆశావాహుల జాబితా కాస్త పెద్దగానే ఉంది.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార బాధ్యతలు స్వీకరించిన తీన్మార్ మల్లన్న ఈ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండగా,ఇంకా కొందరు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండడంతో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగేందుకు నాయకులు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతుంది.దీనితో ఈ సారి భువనగిరి ఎంపీ స్థానం కోసం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశం ఆసక్తిగా మారింది.