మెక్సికో- అమెరికా సరిహద్దును( US-Mexico Border ) తెరిచేది లేదని బైడెన్( President Joe Biden ) పరిపాలనా యంత్రాంగం శుక్రవారం తెలిపింది.టెక్సాస్ సరిహద్దు పట్టణం బ్రౌన్స్‌విల్లేను సందర్శించిన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్( Alejandro Mayorkas ) ఈ వ్యాఖ్యలు చేశారు.
వలసదారులను అడ్డుకోవడానికి సరైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.సురక్షితంగా అమెరికాకు చేరుకోవడానికి అర్హత పొందిన వారి కోసం తాము చట్టపరమైన మార్గాలను నిర్మిస్తున్నామని మయోర్కాస్ పేర్కొన్నారు.
లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వలసదారులు దేశ సరిహద్దుల గుండా అక్రమంగా యూఎస్‌లోకి వస్తున్నారని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండటంతో బైడెన్ యంత్రాంగం ఒత్తిడికి గురైంది.ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన ‘‘టైటిల్ 42’’ ( Title 42 ) నిబంధనల గడువు ముగిసే నాటికి పరిస్ధితి మరింత దిగజారుతుందని రిపబ్లికన్లు హెచ్చరిస్తున్నారు.
సౌత్ కరోలినాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మే 11 అమెరికా ప్రజలకు, ముఖ్యంగా న్యూ మెక్సికో, టెక్సాస్‌లోని ప్రజలకు ఒక పీడకలగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే 90 రోజుల కాలంలో 9,00,000 నుంచి 1.1 మిలియన్ల మంది వలసదారులు అమెరికాలోకి ప్రవేశించబోతున్నారంటూ గ్రాహం హెచ్చరించారు.కరోనా మహమ్మారి అమెరికాలో విజృంభిస్తున్న సమయంలో ఈ నిబంధనలు తీసుకొచ్చారు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కోవిడ్ సోకిన వ్యక్తులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి, సరిహద్దుల వద్ద భద్రత నిర్వహించే సిబ్బంది వారిని తక్షణం దేశంలోకి అనుమతించకుండా ఈ నిబంధనలు రూపొందించారు.
వీటి కాలపరిమితి వచ్చే వారం ముగియనుంది.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం మార్చి నెలలో దేశ దక్షిణ సరిహద్దుల వద్ద అధికారులు 1,92,000 మంది వలసదారులను ఎదుర్కొన్నారట.అయితే వలసలపై నిఘా వుంచడానికి, ఇప్పటికే వున్న సిబ్బందికి సహాయం చేసేందుకు గాను మరో 1500 మంది సైనికులను సమీకరిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా యంత్రాంగం ప్రకటించింది.