తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది.2018 నాటి ఎన్నికల ఫలితాలను ప్రకటించడంలో అవకతవకలు జరిగాయని, కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఈవీఎంల స్ట్రాంగ్‌రూంను తెరిచి… అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఏ, 17 సీ డాక్యుమెంట్ కాపీలను, కౌంటింగ్ సీసీ ఫుటేజీతో పాటు ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న సమర్పించాలని ఆ సమయంలో ఉన్న రిటర్నింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది.దీంతో జగిత్యాల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవనున్నారు.17 ఏ, 17 సీ డాక్యుమెంట్లను పరిశీలిస్తామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు.తరువాత పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్ల వివరాలు నమోదు చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
కాగా 268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో 17 సీ డాక్యుమెంట్ కీలకం కానుంది.