ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తర్వాత వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.
జైల్లో గడుపుతున్నారు.కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు.
అలాంటి కోవలోకే వస్తారు పంజాబ్ రాష్ట్రం హోషియార్ పూర్ కి చెందిన హర్జిందర్ కుమార్.జిల్లాలోని దౌలోవల్ గ్రామానికి చెందిన హర్జిందర్ అనారోగ్యంతో హాంకాంగ్ లో ప్రాణాలు కోల్పోయాడు.
గత కొద్దికాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను ఇటీవలే తుదిశ్వాస విడిచాడు.
ఒక ఏజెంట్ హర్జిందర్ ను ఆస్ట్రేలియాకు చేరుస్తానని చెప్పి హాంకాంగ్ కు పంపాడు.
అయితే మార్గమధ్యంలోనే అతనిని హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.రోజులు గడుస్తున్నప్పటికీ హర్జిందర్ క్షేమ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియలేదు.2013లో జలంధర్ కి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ ద్వారా హర్జీందర్ ఆస్ట్రేలియా వెళ్లాడని.ఈ క్రమంలో హాంకాంగ్ కు చేరుకోగానే అక్కడి పోలీసులు తన సోదరుడిని అరెస్ట్ చేశాడని హర్దీప్ కుమార్ తెలిపాడు.
దాదాపు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత హాంకాంగ్ లోనే హర్జీందర్ పనిచేయడం ప్రారంభించాడని చెప్పాడు.ఈ క్రమంలో అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు హర్దీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
హర్జీందర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు.హర్దీప్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రవ్ జోత్ సింగ్ ను కోరారు.
ఆయన తమకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చిన్నప్పటికీ.ఇంకా ఎలాంటి న్యాయం చేయలేదని హర్దీప్ చెబుతున్నాడు.
గ్రామ సర్పంచ్ రంజిత్ ఖోఖర్ మాట్లాడుతూ.వీరి కుటుంబ పరిస్ధితి దయనీయంగా వుందని చెప్పారు.
హర్జీందర్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో బాధిత కుటుంబానికి సహాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రంజిత్ కోరారు.