ఏపీలో అధికారంలోకి రావాలన్న తపన బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే ప్రజలకు దగ్గరయ్యేందుకు , జనాల ఓట్లు సాధించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తూ, ఇప్పటి నుంచే బీజేపీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టింది.
దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్ పై కామెంట్స్ చేశారు.ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను 50 రూపాయలకే ఇస్తామంటూ వీర్రాజు ప్రకటించడం పై దేశవ్యాప్తంగా బీజేపీ పై సెటైర్లు పడుతున్నాయి.2024 ఎన్నికల్లో బీజేపీకి అంతా ఓటు వేయాలని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక క్వాటర్ 75 కే ఇస్తామని , ఇంకా కుదిరితే 50 రూపాయలకే విక్రయిస్తామని వీర్రాజు ప్రకటించారు.
ఇప్పటికే ఈ ప్రకటనపై వివిధ రాజకీయ పార్టీలు సెటైర్లు వేస్తూ బీజేపీని కామెంట్ చేస్తూ వస్తున్నాయి .ఇక సోషల్ మీడియాలోనూ వీర్రాజు ఎన్నికల హామీ పై సెటైర్లు పడుతున్నాయి.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీలో 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామనడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు.అధికారం కోసం ఇంత దిగజారుతారా అంటూ బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.” వావ్ వాటే స్కీమ్.వాటే షేమ్ .50 రూపాయలకే చీప్ లిక్కర్ అనే బంపర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానమా ? లేక కేవలం బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకి మాత్రమేనా ? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇప్పటికే వీర్రాజు ఎన్నికల హామీ పై వైసీపీ తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా రకరకాలుగా బీజేపీ పై కామెంట్స్ చేస్తున్నారు.అయితే వీర్రాజు కామెంట్స్ పై ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన సైలెంట్ గా ఉండడం పైన వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంలో జనసేన అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా బీజేపీ తరఫున వీర్రాజు ఇచ్చిన ఎన్నికల హామీ మాత్రం దేశవ్యాప్తంగా వైరల్ అవడమే కాకుండా, బీజేపీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.