తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది.ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుండడంతో, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారానికి అన్ని పార్టీలు కేటాయిస్తున్నాయి.
ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరూ ప్రత్యర్ధి పార్టీల వైపు మొగ్గు చూపించకుండా, ఏ పార్టీకి ఆ పార్టీ తీవ్రంగానే కసరత్తు చేస్తున్నాయి.ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ అంతా బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.
కానీ ఇక్కడ కాంగ్రెస్ పేరు పెద్దగా వినిపించడం లేదు.బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ గట్టిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక ఈ నియోజకవర్గం లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారనే విషయం స్పష్టంగా తేలకపోవడం మరింత టెన్షన్ కలిగిస్తోంది.బిజెపి, టిఆర్ఎస్ ల విషయం పక్కన పెడితే, ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పరిస్థితి గురించి చర్చ జరుగుతోంది.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు.ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం గానే ఆయన చేపట్టారు.అయితే మిగతా కాంగ్రెస్ సీనియర్లు పెద్దగా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, ఎన్నికల ప్రచారాన్ని బిజెపి టిఆర్ఎస్ తో పోల్చుకుంటే కాస్త ఆలస్యంగా మొదలుపెట్టడం, ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గత వారం రోజులుగా ఇక్కడ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయినా గెలుపు పై పూర్తి స్థాయిలో అయితే నమ్మకం కలగడం లేదట.
2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈ నియోజకవర్గంలో 62 వేల ఓట్లు వచ్చాయి.ఇప్పుడు ఇక్కడ బిజెపి బాగా బలపడటంతో, కనీసం టిఆర్ఎస్, బిజెపి లకు కాస్త దగ్గరగా అయినా ఓట్లను సాధించాలని, ఇక్కడ కనుక కాంగ్రెస్ ప్రభావం కనిపించకపోతే, రాబోయే ఎన్నికల నాటికి అది ఇబ్బందికరంగా మారుతుంది అనే టెన్షన్ సైతం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది.కాకపోతే ఇక్కడ టిఆర్ఎస్, బిజెపి లు రెండు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పైనే దృష్టి పెట్టాయి.
దీంతో కాంగ్రెస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచినా ఉపయోగం లేదనే విషయాన్ని బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నా,దానిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలం అవుతూనే ఉంది.