టిడిపి అధినేత చంద్రబాబు తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తున్నా.రు ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తూ ఉంటారు.
అంతే కాదు తమ రాజకీయ ప్రత్యర్థలను ముప్పుతిప్పలు పెట్టి పైచేయి సాధించేందుకు ప్రతి దశలోనూ ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు.ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ని ఇరుకున పెట్టడమే ప్రధాన ధ్యేయం గా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని అది తీవ్రంగా ఉందని, జగన్ కు పరిపాలించే అర్హత లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలి అంటూ గత కొంత కాలంగా చంద్రబాబు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు.అయితే ప్రస్తుతం బద్వేల్ ఉప ఎన్నికల తంతు మొదలైంది.
ఇక్కడ టిడిపి పోటీచేసి వైసీపీ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు .అంతేకాదు ఇక్కడి నుంచి ఓబులాపురం రాజశేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించి అందరికంటే ముందుగా తాము ఎన్నికలకు సిద్ధం అన్నట్లుగా వ్యవహరించారు.
కానీ అనూహ్యంగా ఇక్కడ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని, వైసిపి ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు.
అయితే జనసేన, టిడిపి ఈ ఎన్నికల పోటీకి విముఖత వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు.ఇటీవల వెలువడిన అన్ని ఎన్నికల ఫలితాలలోను వైసిపి తిరుగులేని విజయాన్ని సంపాదించుకుంది.
వైసిపి ప్రభావం రాష్ట్రమంతా స్పష్టంగా కనిపిస్తోంది ఇటువంటి సమయంలో తాము ఎన్నికల్లో పోటీ చేసినా, గెలిచే అవకాశం లేదనే అభిప్రాయం అటు టిడిపి జనసేన లో ఉంది అది కాకుండా ప్రస్తుతం ఎన్నికల జరగబోతున్న బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉండడం ఈ జిల్లా జగన్ సొంత జిల్లా కావడం ఇక్కడ మిగతా చోట్ల కంటే గట్టి పట్టు ఉండటం ఇవన్నీ లెక్కలు వేసుకుని పోటీకి దూరంగా ఉన్నట్లు అర్థమవుతుంది.
అంతే కాదు జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత టిడిపి నుంచి ప్రకటన రావడంతో పవన్ తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని , పవన్ బాటలోనే తాము అభ్యర్థిని పోటీకి పెట్టడం లేదనే అభిప్రాయాన్ని కలిగించడంతో పాటు, జనసేనకు దగ్గరయ్యేందుకు తాము ప్రయత్నిస్తున్నాము అనే సంకేతాలను పంపించినట్లు అర్థం అవుతోంది.