తాజాగా టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) భేటీ అయిన విషయం తెలిసిందే.బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశం అయ్యారు.
ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు.సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్( Allu Arjun Arrest ) అనంతర పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు.అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు.
ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది.శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే.తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి.
మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి.ఆలయ పర్యటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి.
ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి.ఇకపై బౌన్సర్ల( Bouncers ) విషయంలో సీరియస్‌గా ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
సినీ పరిశ్రమ( Cinema Industry ) సమస్యలను ప్రముఖులు మా దృష్టికి తెచ్చారు.అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారు.
మా ప్రభుత్వం ఇండస్ట్రీకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం.

8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది.పుష్ప సినిమాకు పోలీసు గ్రౌండ్ ఇచ్చాము.తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము.ఐటీ, ఫార్మాతో పాటు మాకు ఈ రంగం కూడా ముఖ్యమే.తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును తీసుకొచ్చాం.ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును( Dilraju ) ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాము.
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం.పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం.అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
ఇండస్ట్రీకి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి.ఆ వారసత్వాన్ని మేమూ కొనసాగిస్తాం.
తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం అని సీఎం వివరించారు.మొత్తంగా తీసుకుంటే ఈ ఘటన ప్రభావం సినిమాలపై పడనున్నట్లే తెలుస్తోంది.
అంతేకాకుండా సినిమా కలెక్షన్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.