అలనాటి అందాల తార, సీరియల్ ఆర్టిస్టు చిత్ర ఇవాళ ఉదయం కన్నుమూసింది.గుండెపోటుతో హఠాన్మరణం పొందింది.చెన్నైలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచింది.56 ఏండ్ల వయసున్నచిత్ర.తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో మంచి నటిగా గుర్తింపు పొందింది.కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ సహా పలువురు తెలుగు అగ్రనటులతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది.
కమల్ హాసన్ తో కలిసి అమవాస్య చంద్రుడు సినిమా చేసింది.రాజ శేఖర్ తో ఇంద్రధనుస్సు అనే సినిమాలో నటించింది.రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన పదహారేళ్ల అమ్మాయి చిత్రంలో చిత్ర హీరోయిన్ పాత్ర పోషించింది.రాజేష్ తో కలిసి నల్లత్రాచు, దగ్గుబాటి రాజాతో నేటి స్వతంత్రం సినిమాల్లో యాక్ట్ చేసింది.
చిత్ర తన అందచందాలతో పాటు, అభినయంతో సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.తన మాతృభాష మలయాళంతో పాటు తమిళ సినిమాలు ఎక్కువగా చేసింది.మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, జయరామ్, సురేశ్ గోపి లాంటి టాప్ హీరోలతో కలిసి పనిచేసింది.తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, కార్తీక్, ప్రభు సహా పలువురు అగ్రతారలతో కలిసి నటించింది.
ఏ పాత్ర పోషించినా అందులో లీనమై నటించేది చిత్ర.ఎలాంటి ఎక్స్ ప్రెషన్ అయినా.
ఈజీగా చేసి చూపించేది చిత్ర.చిత్ర సీన్ అయితే చాలు దర్శకులు రీటేకుల అవసరం ఉండేది కాదు అని భావించే వారు.
ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్ లో ఓకే అయ్యేలా నటించేది.
1965లో కొచ్చిలో జన్మించింది చిత్ర.చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించింది.పదేండ్ల వయసు వచ్చే సరికి పలు సినిమా అవకాశాలు వచ్చాయి.
దీంతో 10వ తరగతి వరకు చదివింది.పై చదువులకు వెళ్లలేదు.1990లో ఆమె వివాహం చేసుకుంది.భర్త విజయ రాఘవన్.1992లో వారికి అమ్మాయి పుట్టింది.పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాకు దూరంగా ఉన్న చిత్ర మరికొంత కాలానికి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
చివరగా తెలుగులో 2005లో ప్రేమించాక అనే సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో కనిపించింది.ఆ తర్వాత తమిళ సీరియల్స్ లో బిజీ అయ్యింది.