ఇది బీజేపీ కి చాలా క్లిష్టమైన సమయం.ఏపీలో ఉనికి చాటుకునేందుకు, బీజేపీ బలం గతంతో పోలిస్తే బాగా పెరిగింది అని నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశం.
తిరుపతి ఉప లోక్ సభ ఉప ఎన్నికలలో బిజెపి విజయం సాధించకపోయినా, కనీసం రెండో స్థానానికి పరిమితం అయితే, అప్పుడు బీజేపీ గ్రాఫ్ ఏపీలో బాగా పెరుగుతుంది.ఆ పార్టీ భవిష్యత్తు పై అందరికీ నమ్మకాలు ఏర్పడతాయి.
ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జాతీయ నేతలు ఒక్కొక్కరుగా ఏపీకి క్యూ కడుతూ, బీజేపీ కి విజయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ ఏపీ బీజేపీ నాయకులు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
కేవలం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి హవా మాత్రమే కనిపిస్తోంది.
ఇంకా అనేకమంది వాక్చాతుర్యం ఉన్న ఏపీ నేతలు చాలా మంది ఉన్నా, వారి వాయిస్ మీడియాలో కానీ , మరెక్కడ కానీ వినిపించడం లేదు.దీని కారణంగా ఏపీ బీజేపీ ప్రభావం పెద్దగా లేదు అని, పూర్తిగా జనసేన సహకారం మీదనే బీజేపీ ఆధారపడి ఉందనే అభిప్రాయము జనాలు బాగా కనిపిస్తోంది.
దీనికి తగ్గట్టుగానే మిగతా నేతలంతా సైలెంట్ గా ఉండిపోవడం, కేవలం తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు తప్ప, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే అవకాశం ఇవ్వకపోవడం వంటివి చర్చనీయాంశం అవుతున్నాయి.
అయితే విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు ఇద్దరు వైసీపీకి కాస్త అనుకూలమైన వ్యక్తిగా ముద్ర వేయించుకోవడంతోనే మిగతా వారు ఎవరికీ ఆ చాన్స్ ఇవ్వకుండా, తామిద్దరం మాత్రమే నేతలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి.ఏపీలో బలమైన సామాజిక వర్గం గా ఉన్న నాయకులు, రాజకీయాల పై మంచి పట్టు ఉండి, తమ విమర్శలతో జనాల్లో ఆలోచన రేకెత్తించే గల నాయకులు ఏపి బీజేపీ లో చాలామందే ఉన్నా, వారెవరికీ తగిన ప్రాధాన్యం దక్కకుండా, సొంత పార్టీ నాయకులే వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ చాలానే నష్టపోతోందనే అభిప్రాయాలు చాలా మంది బీజేపీ నాయకుల్లో కనిపిస్తోంది.