టిఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడూ ఎదుర్కొలేనంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.వివిధ సర్వేల్లో ఈ విషయం స్పష్టం అయింది.
కేసీఆర్ పదే పదే నాయకులను హెచ్చరిస్తున్నా, ఈ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం, అదే పని టిఆర్ఎస్ లోపాలను ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బిజెపి ఎత్తి చూపిస్తుండడం, సొంత పార్టీ నాయకుల అసమ్మతి, గ్రూపు రాజకీయాలు ఇలా చాలా కారణాలతోనే టిఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ప్రజల్లో పార్టీపై వ్యతిరేకతను తగ్గించేందుకు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా కేసీఆర్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
అయినా, ప్రజల్లో వ్యతిరేకత తగ్గిపోవడానికి గల కారణాలు కేసీఆర్ విశ్లేషించుకోవడం పూర్తిగా ఎమ్మెల్యేల వైఖరి కారణంగానే ప్రజల్లో పార్టీపైనా, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది అనే విషయాన్ని కెసిఆర్ గుర్తించారు.
పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల విషయంపై స్పందించకపోగా, సొంత వ్యవహారాలు, వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారని, అవినీతి అక్రమాల్లో మునిగితేలుతూ, ప్రజల్లో వ్యతిరేకతతో ఎదుర్కొంటున్నారు అనే విషయం కెసిఆర్ దృష్టికి వచ్చింది.
అందుకే ఈరోజు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు.ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన అనేక విషయాలపై కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు పైన, వారి వ్యవహార శైలిపైనా, ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పని తీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదనే విషయాన్ని కేసీఆర్ కుండబద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే ఎమ్మెల్యేల పనితీరు పైన కెసిఆర్ సంచలన ప్రకటనలు చేయబోతున్నట్లు సమాచారం.
ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడానికి ప్రధాన కారణం సిట్టింగ్ కార్పొరేటర్లు వ్యతిరేకతను ఎదుర్కోవడం అని, ఎక్కువమందికి మళ్ళీ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలలో సీటు ఇవ్వడం ద్వారా మెజార్టీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.అలాగే అన్ని మొహమాటాలు పక్కనబెట్టి ఎమ్మెల్యేలు పనితీరుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది.ఎమ్మెల్యేల పనితీరు కారణంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం, అవమానాలకు గురవుతున్నారని, ప్రత్యర్థులు రాజకీయంగా బలపడేందుకు అవకాశం స్వయంగా ఇస్తున్నట్లు అవుతుందని కేసీఆర్ ఎమ్మెల్యేలతో ప్రస్తావిస్తారట.
ఏది ఏమైనా, మొత్తం ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం కేసీఆర్ కు రావడంతో ఇక ముందు ముందు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.