పూర్వం రాజులు, మహారాజులు, చక్రవర్తులు, సుల్తాన్‌లు యుద్ధాలలో తాము సాధించిన విజయాలకు గుర్తుగా శాసనాలు వేయించడమో, బంగారు, వెండి నాణేలను ముద్రించడమో చేసేవారు.తమ తర్వాతి తరాలకు ఆదర్శంగా, ముఖ్యంగా చరిత్ర రచనకు అవి ఎంతగానో తోడ్పడేవి.
అచ్చం అదే తరహా ఆలోచనతోనే ముందుకు వెళ్తోంది అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడి కోలుకున్నందుకు గుర్తుగా ‘‘ట్రంప్ డిఫీట్స్ కొవిడ్’’ (ట్రంప్ కొవిడ్‌ను జయించారు) అనే పేరుతో నాణేల విక్రయాన్ని చేపట్టింది వైట్‌హౌస్ .కాగా ఆస్పత్రి నుంచి అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సోమవారం చేరుకున్నారు.కోవిడ్-19 నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఆయనను నాలుగు రోజుల కిందట వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌కు తరలించిన విషయం తెలిసిందే.ట్రంప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సిఫార్సు మేరకు ఆస్పత్రిలో చేరారు.గత 72 గంటలుగా ఆయనకు జ్వరం రాలేదని, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
శ్వేతసౌధంలోని అధికారిక విక్రయశాల ‘వైట్‌హౌస్ గిఫ్ట్ షాప్’ నాణేల విక్రయం సంగతిని ప్రకటించింది.పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే ఈ నాణెం విక్రయాలు స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.అయితే 100 డాలర్ల విలువ గల ఈ నాణెం పంపిణీ నవంబర్ 14నుంచి మొదలవుతుందని దీని రూపకర్త, వైట్‌హౌస్ గిఫ్ట్ షాప్ ఛైర్మన్ ఆంథోనీ గియాన్నిని ప్రకటించారు.
ఈ నాణేల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కరోనా నివారణకు, క్యాన్సర్ బాధితుల చికిత్సకు అందచేస్తామని ఆయన వెల్లడించారు.
ఇది ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో విడుదలయ్యే ఆఖరి స్మారక నాణెమని ఆంథోనీ పేర్కొన్నారు.ప్రకటనైతే విడుదలైంది కానీ నాణెం నమూనా కానీ, చిత్రాలు కానీ బయటికి రాలేదు.
అయితే ట్రంప్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం కనుక ఈ కొత్త నాణెం అదే ఫార్మాట్‌లో వుండే అవకాశాలున్నాయని ఆంథోనీ సంకేతాలు ఇచ్చారు.