జగన్ మూడు రాజధానుల సూచనప్రాయ ప్రకటన తర్వాత ప్రజల సంగతేంటోగానీ.దీనివల్ల తక్షణం ప్రభావితులయ్యే ఉద్యోగులు మాత్రం అప్పుడే లబోదిబోమంటున్నారు.
మూడు రాజధానులు ఉంటే తప్పేంటి? ఏపీకి కూడా ఉండొచ్చు.అమరావతిలో చట్టసభలు, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని ఉండొచ్చు అని జగన్ అస్పష్టంగా చెప్పి.
రాజధానిపై స్పష్టత వచ్చిందనుకుంటాను అని ముగించారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత ఇక నిర్ణయంలో మార్పు ఏముంటుంది అనుకున్నారేమో ఉద్యోగులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.రెండేళ్ల కిందటే హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాము.అప్పుడే తట్టాబుట్టా సర్దుకొని మళ్లీ విశాఖపట్నం వెళ్లాలంటే ఎలా కుదురుతుంది అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా? వచ్చే ఎన్నికల్లో మరో ప్రభుత్వం వస్తే.మేము మరో చోటికి వెళ్లాలా? ఇదెక్కడి న్యాయం అని నిలదీస్తున్నారు.నిజానికి చాలా మంది ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మాది అనుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.అయితే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగి.బలవంతంగా అయినా భాగ్యనగరాన్ని వదిలి అమరావతికి రావాల్సి వచ్చింది.
ఇప్పుడైనా అమరావతే తమ సుస్థిర రాజధానిగా ఉంటుంది కదా అనుకొని కొందరు ఉద్యోగులు ఈ రెండు, మూడేళ్లలో విజయవాడ, గుంటూరులలో సొంతంగా ఇళ్లు కూడా కొన్నారు.ఇప్పుడు సడెన్‌గా విశాఖపట్నం వెళ్లాలంటే ఎలా అంటూ వాళ్లు ఆందోళన చెందుతున్నారు.మరికొందరు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే తమ కుటుంబాలను ఉంచి.
వారాంతాల్లో వెళ్లి వస్తున్నారు.
ఇప్పుడు వైజాగ్‌కు మారిస్తే.
అలా హైదరాబాద్ వెళ్లి రావడం కుదరదు.దీంతో వాళ్లలోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం రాజధానిపై స్పష్టత ఇచ్చినా ఇప్పటికీ ఎందుకు ఉద్యోగ సంఘాల వాళ్లు నోరు మెదపడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.అధికారిక ప్రకటన వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అమరావతిని వీడాల్సి వస్తుందని, అంతలోపే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.