తమకు బలం లేకపోయినా బలగం ఉందన్న ధీమాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.తెలుగుదేశం పార్టీని మించి అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు.
పవన్ చేస్తున్న విమర్శలపై వైసీపీ స్పందిస్తూ ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు తాము సమాధానం చెప్పనవసరం లేదు అంటూనే వైసిపి నాయకులు జనసేన పై ఎక్కువగా స్పందిస్తున్నారు.ఒకవైపు బలం లేదంటూనే ఇలా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ పవన్ స్థాయిని వైసీపీ నేతలు పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదే తమకు కూడా కావాల్సింది అన్నట్టుగా పవన్ కూడా ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడు.చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ, అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి స్పందిస్తున్నారు.
దీక్షలు, ధర్నాల పేరుతో హడావుడి చేస్తున్నారు.అయితే ఇదే పని గత టిడిపి ప్రభుత్వంలో పవన్ చేయకపోవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ఎన్నికల ముందు వరకు బిజెపి ఏపీకి అన్యాయం చేసిందని, ఆ పార్టీ మీద విమర్శలు చేసిన పవన్ ప్రస్తుతం మాత్రం బిజెపి మీద, ఆ పార్టీ అగ్ర నాయకులు మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు.ఈ పరిణామాలు వైసీపీకి అసహనం తెప్పిస్తున్నాయి.
భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో తమకు పెద్దగా ఇబ్బంది లేదని, అసలు చిక్కంతా పవన్ తోనే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.అందుకే పవన్ బలపడకుండా ఇప్పటి నుంచే ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు.
కానీ దీనివల్ల వైసీపీకి కలిసొచ్చే దానికంటే జనసేన కు కలిసి వచ్చేది ఎక్కువగా కనిపిస్తోంది.బీజేపీ కూడా పరోక్షంగా పవన్ కు మద్దతుగా నిలబడి ఉండటంతో ఏపీ అధికార పార్టీ నాయకులూ పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
బిజెపి మాత్రం జనసేనని బీజేపీలో విలీనం చేసే ప్లాన్ లో భాగంగా ఇదంతా చేస్తున్నట్లు గా కనిపిస్తోంది.కానీ పవన్ బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నారు.బిజెపిలో లో జనసేన ను విలీనం చేస్తే పవన్ వ్యక్తిగత ఇమేజ్ ను ఉపయోగించుకుని ఏపీలో బలమైన పార్టీగా మారవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఈ విషయాన్ని వైసిపి ముందుగానే గ్రహించింది.
అందుకే పవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ద్వారా బీజేపీకి, పవన్ కు ఒకేసారి చెక్ పెట్టవచ్చని అని భావిస్తోంది.అయితే ఇదంతా పవన్ కు అనుకూలంగా మారుతున్నాయనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.