సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు బయట వారి సలహాలు, సూచనలు పెద్దగా అవసరం లేకుండా ఉండేది.ఆ పార్టీలో ఉన్న రాజకీయ ఉద్దండులతో పాటు అధినేత చంద్రబాబు రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలతో పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టేవారు.
ఎటువంటి విపత్కర పరిస్థితిని అయినా సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బాబు దిట్టగా పేరు పొందాడు.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరంగా ఉండడంతో పాటు కొంచెం ఇబ్బందికర పరిణామాలనే ఎదుర్కుంటోంది.
ఒక వైపు చూస్తే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ దశలో బాబు స్థాయిలో పార్టీని ముందుకు నడిపించే నాయకులు ఆ పార్టీలో లేరనే చెప్పాలి.
చంద్రబాబు రాజకీయ వారసుడుగా లోకేష్ ఉన్నా సమర్ధవంతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే సత్తా లోకేష్ కు లేదు.ఈ దశలో రాజకీయ వ్యూహకర్త అవసరం తెలుగుదేశానికి వచ్చింది.
అసలు ఈ రాజకీయ వ్యూకర్తలను నియమించుకునే సంస్కృతి తెలుగురాష్ట్రాల్లో మొదటగా తీసుకు వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ అనే బీహార్ కు చెందిన రాజకీయ వ్యూహకర్త వైసీపీ తరపున పనిచేసి ఆ పార్టీకి ఎక్కడలేని బలాన్ని తీసుకు రావడంతో పాటు 175 సీట్లలో 151 సీట్లను గెలుచుకునేలా తన వ్యూహాలను అమలుచేసాడు.ప్రస్తుతం టీడీపీ కూడా ఆ విధంగానే ప్రశాంత్ కిషోర్ వంటి రాజకీయ వ్యూహకర్త కోసం వెతుకులాట ప్రారంభించినట్టు తెలుస్తోంది.2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరైన వ్యూహకర్తను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ సీనియర్ నేతకు చంద్రబాబు నాయుడు అప్పగించినట్లు సమాచారం.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అయ్యింది.గెలుపు కోసం ఎన్ని ఎన్ని పథకాలు ప్రకటించి అమలు చేసినా ఫలితం దక్కలేదు సరికదా అవమానకరమైన సంఖ్యలో కేవలం 23 సీట్లు దక్కించుకుంది.
దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎక్కడలేని నైరాశ్యం నెలకొంది.ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి వెల్లిపోయారు.కొన్ని నియోజకవర్గాల్లో సరైన నేత కూడా లేరు.దీంతో చంద్రబాబు వ్యూహకర్త కోసం వెతుకులాట మొదలుపెట్టినట్టు సమాచారం.
వ్యూహకర్త లేకుంటే పార్టీ పుంజుకోవడం కష్టమేనని సీనియర్ నేతలు కూడా చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందినా ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో పాటు క్షేత్ర స్థాయిలో టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి.కేవలం 23 స్థానాలు వచ్చినా గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లను తెలుగుదేశం సాధించింది.ఈ దశలో చంద్రబాబు సమర్థతపై కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు.
అయితే సరైన అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం, వ్యూహాలు అనుసరించక పోవడం వల్లనే గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు.అందుకే ప్రశాంత్ కిషోర్ వంటి సమర్ధమైన వ్యూహాకర్తను వెతికే పనిలో పడ్డారు.