అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జో బైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయ కమ్యూనిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు.తన టీమ్‌లో ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
తాజాగా తన పాలనా యంత్రాంగంలోకి మరో 11 మందిని తీసుకోవాలని భావిస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.వీరిలో ఇద్దరు ఇండో అమెరికన్లకు కూడా స్థానం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
భారతీయ అమెరికన్లు రాహుల్ గుప్తా, అతుల్ గవాండే ఆ లిస్ట్‌లో ఉన్నారు. రాహుల్ గుప్తాను నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరక్టర్‌గా, అతుల్ గవాండేను బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించనున్నారు.
భారతీయ దౌత్యవేత్త కుమారుడైన రాహుల్ గుప్తా భారత్‌లో జన్మించారు.అనంతరం వాషింగ్టన్‌లో ఆయన పెరిగారు.రాహుల్ గుప్తా ప్రజారోగ్య విధానాలపై అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, టాస్క్‌ఫోర్సులకు సలహాదారుగా పనిచేస్తున్నారు.ఎబోలా, జికా వైరస్ వ్యాప్తి సమయంలో దానిని ఎదుర్కోనే బృందానికి నాయకత్వం వహించారు.
పటిష్టమైన కార్యాచరణ ద్వారా రెండు వైరస్‌లపై పోరాడారు.
ఇక అతుల్ గవాండే విషయానికి వస్తే.ఆయన అరియాడ్నే ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడిగా వున్నారు.కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆయన కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ పనులను నిర్వర్తించిన సీఐసీ హెల్త్‌ను అతుల్ స్థాపించారు.
అలాగే జో బైడెన్ ట్రాన్సిషన్ కోవిడ్ 19 అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా అతుల్ పనిచేశారు.గతంలో 1998 నుంచి ది న్యూయార్కర్ మేగజైన్‌కు స్టాఫ్ రైటర్‌గా వ్యవహరించారు.
అలాగే నాలుగు పుస్తకాలను అతుల్ రచించారు.అవి కాంప్లికేషన్స్, బెటర్, ది చెక్‌లిస్ట్ మానిఫెస్టో, మరియు బీయింగ్ మోర్టల్.