తమ నాయకుడి పై కానీ తమ ప్రభుత్వం కానీ వస్తున్న విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్న వైసిపి నేతలు ఒక తెలుగుదేశం నేతపై మాత్రం ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఆయనపై ఎదురు దాడి చేయడం అనవసరం అనుకుంటున్నారో లేకపోతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో తెలియదు కానీ ఆయన వైపు నుంచి భారీ కౌంటర్లు పడుతున్నా కానీ కనీస రీకౌంటర్ లు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆయన మరెవరో కాదు ఉత్తరాంధ్ర టిడిపి ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన గంటా శ్రీనివాస్ రావు( Ganta Srinivasa Rao ) ఇటీవల అమరావతి( Amaravati ) లోని ఆర్ ఫై జోన్లో ఇళ్ల నిర్మాణం పై హైకోర్టు స్టే ఇవ్వటం తో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు .ఆర్ ఫై జోన్ అన్నది అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎలక్ట్రానిక్ సిటీ గా ఉన్నదని అలాంటి జోన్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలనుకోవడం వైసీపీ ప్రభుత్వ మూర్ఖత్వ చర్య గా ఆయన అభివర్ణించారు.

మరోచోట పేదలకు ఇళ్ళ నిర్మాణం చేపట్టి ఉండుంటే ఈరోజు కోర్టు చేత అక్షింతలు వేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా నెత్తికెక్కిన తమ కళ్ళను కిందకు దించుకొని జగన్ ఆలోచించాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా చేశారు .అమరావతి మాస్టర్ ప్లాన్ అన్నది ఆంధ్రుల భవిష్యత్తుకు ఆదారం వంటిదని అలాంటిదాన్ని ధ్వంసం చేసే హక్కు జగన్కు( CM Jagan ) ఎవరిచ్చారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

అయితే తమ పై వస్తున్న చిన్న చిన్న విమర్శలకు కూడా భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శిస్తున్న వైసిపి నాయకులు గంటపై మాత్రం నో సౌండ్ అంటున్నారు.కళ్ళు నెత్తికెక్కిపోవడం , మూర్ఖత్వం వంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఆయనపై తిరిగి కౌంటర్ ఇవ్వకపోవడం చర్చనీయాంశం గా మారింది .ముఖ్యంగా ఆయనపై వైసీపీకి ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .ఆయనకు పార్టీ మారే ఉద్దేశం ఉన్నదని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక నేత అయినందున ఆయన ను పార్టీలోకి చేర్చుకుంటే పార్టీ లాభపడుతున్న ముందుచూపుతోనే ఆయనపై విమర్శలు చేయడం లేదని ప్రచారం అయితే జరుగుతుంది.