పక్కవాడు ఎలా పోతే నాకేంటి అనుకునే ఈరోజుల్లో మూగజీవుల కష్టాన్ని అర్ధం చేసుకుని నాకు ఒక మనసు ఉంది అని నిరూపించుకున్నాడు ఈ యువకుడు.మూగజీవులకు ఎదో ఒక ఆసరా కల్పించాలని దృఢ నిశ్చయంతో ఒక సరి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.
మన ఇంట్లో పాత టీవీలు ఉంటే మనం ఏమి చేస్తాము.పనికిరావు కదా అని పాత సామాన్లకి వేయడమో లేక బయట పారవేయడమో చేస్తాము.
కానీ ఆ యువకుడు మాత్రం తన ఇంట్లోని పాత టీవీని ఏకంగా ఇల్లుగానే మార్చేశాడు.అలా ఇల్లుగా మార్చిన ఇంటిలో వీధి కుక్కలకు నీడనిచ్చాడు.
అసలు వివరాలలోకి వెళితే.అస్సాంలో నివసించే అభిజీత్ దోవర్హా కి మూగజీవులంటే చాలా ఇష్టం.వాటి కోసం ఎదో ఒకటి చేయాలనీ తాపత్రయపడుతూ ఉంటాడు.అయితే, మనుషులకు ఉండడానికి ఇళ్లు ఉంటాయి కాబట్టి.
ఎండ, వాన, చలి అనే వాటికి వాళ్ళు దడవరు.ఇంటిలో తలదాచుకుంటారు.
మరి మూగ జంతువుల పరిస్థితి ఏమిటి.?? వాటికి ఉండడానికి గూడు లేదు, అసలే ఇప్పుడు చలికాలం.వాటి బాధను అర్ధం చేసుకున్న అభిజీత్ వారికి ఎలాగైనా నీడ కల్పించాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నదే తడవుగా ఒక ఆలోచన చేసాడు.ఓ చోట అతడికి వేస్టుగా పడివున్న ఖాళీ టీవీ సెట్లు కనిపించాయి.వాటిలో కుక్క పిల్లలకు ఆవాసం ఏర్పరచాలనే ఆలోచన వచ్చింది.
అక్కడ ఉన్న టీవీలను సేకరించాడు.
టీవీలో ఉండే వేస్ట్ పార్ట్‌లను తొలగించాడు.
వాటికి అందంగా రంగులు వేసి.బుల్లి ఇల్లుగా మార్చేశాడు.
కుక్కపిల్లలకు నీడను ఏర్పరిచాడు.ఈ సందర్భంగా అభిజీత్ మాట్లాడుతూ.
‘‘వీధి కుక్కలకు చిన్న ఇళ్లు కట్టిస్తే బాగుంటుందని అనిపించింది.దానివల్ల వాటికి ఆశ్రయం లభిస్తుంది.
లేకపోతే అవి చలి లేదా వర్షాలకు చనిపోతాయి.అందుకే, పనికిరాని పాత టీవీ సెట్లను వీధుల్లో ఉంచాను.
మరిన్ని టీవీ సెట్లను ఇలాగే మార్చబోతున్నా.ఒకవేళ టీవీ సెట్లు అందుబాటులో లేకపోతే చెక్కతో బాక్సులు తయారు చేసి ఏర్పాటు చేస్తాను’’ అని తెలిపాడు.
మూగజీవాలకు ఆశ్రయం ఏర్పాటు చేసే ఆలోచన చేసిన అభిజీత్ ను పలువురు నెటిజనులు ప్రశంసిస్తున్నారు.