అమెరికాలో ఉద్యోగం, వీసా సంపాదించడం ఒక ఎత్తయితే .దానిని నిలబెట్టుకోవడం ఇప్పుడో ప్రహసనంగా మారింది.
అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రకరకాల వివాదాస్పద నిర్ణయాలతో వలసదారులను చిక్కుల్లో నెట్టారు.కోర్టుల్లో మొట్టికాయలు పడినా ఆయన లెక్క చేయలేదు.2020లో బైడెన్ పగ్గాలు అందుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్ధితుల్లో మార్పులు వస్తున్నాయి.వలసదారుల పట్ల చూసీచూడనట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు.
తాజాగా వర్క్ పర్మిట్ గడువు తీరిపోతే.తమ ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న లక్షలాది మంది వలసదారులకు ఊరట కలిగే ప్రకటన వెలువడింది.
వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తున్న కొన్ని కేటగిరీల వారికి మరో 18 నెలల పాటు గడువు పొడిగిస్తున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది.వీరిలో గ్రీన్ కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారు.
హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు వున్నారు.మే 4 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.
ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ అథరైజేషన్ కార్డ్ (ఈఏడీ)ల గడువు ముగిసిన తర్వాత కూడా 180 రోజుల వరకు వాటిని ఉపయోగించుకునే వీలుంది.ఇప్పుడు దానిని 540 రోజులకు పెంచింది అమెరికా ప్రభుత్వం.
ఈఏడీ రెన్యూవల్‌కు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ఐఎస్‌సీ తెలిపింది.ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈఏడీ రెన్యూవల్ దరఖాస్తులు పెండింగ్‌లో వున్న వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసినా మరో 540 రోజుల పాటు పని అనుమతులు పొంది ఉద్యోగాలు చేసుకోవచ్చు.తాజా నిర్ణయం వల్ల 87 వేల మంది వలసదారులకు తక్షణ లబ్ధితో పాటు దాదాపు 4.20 లక్షల మంది వలసదారులు పని అనుమతులు కోల్పోకుండా వుంటారు.దీని వల్ల భారతీయులకే మేలు జరుగుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి సుమారు 15 ఏళ్లు పడుతుంది.ఈలోగా హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేయడానికి అనుమతి ఉండేది కాదు.వీరి ఆవేదనను అర్ధం చేసుకున్న నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) బిల్లు తెచ్చారు.
దీని ప్రకారం హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించారు.దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపింది.దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్‌సీఐఎస్ నుంచి ఈఏడీ పొంది తమకు నచ్చిన ఉద్యోగాల్లో చేరారు.
జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు.అయితే రెండేళ్లుగా కరోనా తదితర కారణాలతో యూఎస్‌సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు.దీంతో గతేడాది మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దీనిపై భారతీయులు పలు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయపోరాటం సైతం చేస్తున్నారు.