అబార్షన్ హక్కులపై అగ్రరాజ్యం అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే.సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి.
గత వారం వాషింగ్టన్ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు… తమ హక్కులను కాలరాయవద్దంటూ నినాదాలు చేశారు.తాజాగా ఆదివారం మాడిసన్‌లోని యాంటీ అబార్షన్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
పలు భవనాలకు నిప్పు పెట్టి.ఫర్నీచర్ తగులబెట్టారు.
మాడిసన్‌లోని విస్కాన్సిన్ ఫ్యామిలీ యాక్షన్ ఆఫీసులో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మాడిసన్ పోలీస్ ప్రతినిధి స్టెఫానీ ఫ్రైయర్ చెప్పారు.అయితే ఈ ఘటన అనుమానాస్పదంగా వుందన్నారు.
భవనం వెలుపల ఎవరో ఒక సందేశాన్ని స్ప్రే పెయింట్ చేశారని స్టెఫానీ చెప్పారు.ఫెడరల్ అధికారులు, మాడిసన్ అగ్నిమాపక విభాగం అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.ప్రమాదం కారణంగా ఎంత నష్టం జరిగిందో తెలుసుకునే పనిలో అధికారులు వున్నారని వెల్లడించారు.
భవనాన్ని ఎవరు ధ్వంసం చేశారో స్పష్టం తెలియరాలేదు.అయితే ‘‘అబార్షన్‌లు సురక్షితం కాకపోతే మీరు కూడా కాదు’’ అనే సందేశాన్ని స్ప్రే పెయింట్ చేశారు.దర్యాప్తు అధికారులు ఘటనా ప్రదేశంలో మోలోటివ్ కాక్‌టెయిల్ అవశేషాలను కనుగొన్నారు.డెమొక్రాటిక్ గవర్నర్ టోనీ ఎవర్స్, రిపబ్లికన్ యూఎస్ సెనేటర్ రాన్ జాన్సన్‌లు సహా విస్కాన్సిన్‌లో రెండు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఈ ఘటనను ఖండించారు.
కాగా.అమెరికాలో అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు ఇటీవల లీకైన ముసాయిదాలో ఉంది.
రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల తీర్పు సరిగా లేదని లీకైన ముసాయిదా పత్రాలపై అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.