అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు తీసుకు వచ్చింది.10వేల మంది హెచ్-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించినట్టు తెలుస్తోంది.దానికోసం ఓపెన్ వర్క్-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్( Sean Fraser ) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ ప్రొగ్రామ్ కింద హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు కూడా చెప్పడం విశేషం.
ఈ విషయమై కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేయడం జరిగింది.ఆ ప్రకటనలో ఏముందంటే… ”హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పని చేయడం జరుగుతుంది.
కాగా ఇందులో చాలా మంది హెచ్-1బీ వీసాదారులే ఉండడం గమనార్హం.జులై 16, 2023 నాటికి హెచ్-1బీ వీసాలో అమెరికాలో( America ) పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు!” అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఇపుడు ఈ విషయం కెనడా వెళ్లి సెటిల్ కావాలని అనుకున్నవారికి వరంగా మారనుంది.ఈ కొత్త ప్రోగ్రామ్ కింద.ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాదారులకు మూడేళ్ల కాలావధితో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది.వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.అంతేకాకుండా వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం లేదా చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకొనే వీలుంది.అయితే, ఈ స్ట్రీమ్ కింద దరఖాస్తు చేసుకునేందుకు ఎవరెవరు అర్హులు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.
టెక్నాలజీ సహా కొన్ని ప్రత్యేక రంగాల్లో అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా విదేశీయులకు హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటారు.వీరిలో అత్యధికంగా భారతీయులే ఉండడం గమనార్హం.