తెలుగు రాష్ట్రాలలో వరి( Rice ) తరువాత అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న ( Corn crop )సాగు అవుతోంది.అయితే మొక్కజొన్నలో పోషకాల యాజమాన్యం పై పూర్తి అవగాహన ఉంటే మంచి దిగుబడి సాధించవచ్చు.
మార్కెట్లో హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి.ఇవి ఒక ఎకరాకు 40 నుంచి 50 కింటాళ్ళ వరకు దిగుబడులు ఇస్తున్నాయి.
మొక్కజొన్న సాగు చేసేందుకు ఖరీఫ్ అనువైన సమయం.95 నుంచి 110 రోజుల్లో మొక్కజొన్న పంట చేతికి వస్తుంది.ఖరీఫ్ లో సాగు చేస్తే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు.మొక్కజొన్న సాగుకు నీరు ఇంకిపోయే ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు ( Sandy soils )చాలా అనుకూలంగా ఉంటాయి.
వేసవికాలంలో పొలాన్ని రెండు లేదా మూడుసార్లు బాగా లోతు దుక్కులు దున్నుకొని చివరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలయదునుకోవాలి.
మొక్కజొన్న విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.మొక్కజొన్న విత్తిన రెండు రోజుల్లో అట్రాజిన్ 50 శాతం పొడి మందును ఎకరాకు 800గ్రా , 200లీటర్ల నీటిలో కలిపి తేమ నేలపై పిచికారి చేయాలి.ఒక ఎకరం మొక్కజొన్న పొలానికి 75 కిలోల నత్రజని 25 కిలోల భాస్వరం 20 కిలోల పొటాష్ ఎరువులు, జింక్ సల్ఫేట్ అవసరం.
నత్రజనని మూడు భాగాలుగా చేసుకొని 1/3 భాగం విత్తే సమయంలో, 1/3 భాగం విత్తిన 35 రోజులకు, మిగిలిన 1/3 భాగం విత్తిన 55 రోజులకు పొలంలో వేసుకోవాలి.ఎరువులు మొక్కలకు ఐదు సెంటీమీటర్ల దూరంలో, ఐదు సెంటీమీటర్ల లోతులో వేయాలి.
అప్పుడే పోషకాలు మొక్కకు సమృద్ధిగా లభిస్తాయి.ఒక ఎకరం పొలంలో 20 కిలోల జింక్ సల్ఫేట్ ను ప్రతి రెండు లేదా మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేసి కలియ దున్నితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.