మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు సింగపూర్ కోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వీరిద్దరిని సింగపూర్‌లోని అప్పీల్ కోర్ట్ శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించింది.
ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.భారత సంతతికి చెందిన రాజ్ కుమార్ అయ్యాచామి (40) తన మరణశిక్షకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను పరిగణనలోనికి తీసుకుంది.
అలాగే మాదక ద్రవ్యాల రవాణా కేసులో విధించిన జీవిత ఖైదు , 15 లాఠీ దెబ్బలకు వ్యతిరేకంగా భారత సంతతికి చెందిన మలేషియా పౌరుడు రామదాస్ పున్నుసామి దాఖలు చేసిన అప్పీల్‌ను సైతం కోర్ట్ అనుమతించింది.వీరిద్దరూ 1.875 కిలోల కంటే తక్కువ గంజాయితో వున్న డ్రగ్స్ బ్యాగ్‌ను కలిగి వుండటంతో పోలీసులు అభియోగాలు మోపారు.సెప్టెంబర్ 21, 2015న రాజ్‌కుమార్‌కు బ్యాగ్‌ను అప్పగిస్తున్న రామ్‌దాస్‌ను సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గమనించారు.
రమేశ్ తివారీ తరపున పనిచేస్తున్న రాజ్.తన వద్ద వున్న డ్రగ్స్‌కు సంబంధించి వివాదం చేయలేదు.కానీ పొరపాటున డెలివరీ జరిగిందని వాదించాడు.బటర్ ఫ్లై అని పిలవబడే అచ్చం గంజాయి మాదిరిగా వుండే సింథటిక్ కెమికల్‌తో కూడిన పొగాకును తాను ఆర్డర్ చేశానని రాజ్ చెప్పాడు.
అయితే దీనికి బదులుగా గంజాయితో వున్న బ్యాగ్ తనకు డెలవరీ వచ్చిందని అతను వాదించాడు.
ఇక రామ్‌దాస్ విషయానికి వస్తే.తాను బ్యాగ్‌ను రాజ్‌కు డెలివరీ చేశానని, కానీ అందులో డ్రగ్స్ గురించి తనకు తెలియదన్నాడు.కానీ తాను నడుపుతున్న లారీలో కెమికల్ స్ప్రే చేసిన నాలుగు పొగాకు బస్తాలు వున్నట్లు దర్యాప్తు అధికారులకు తెలిపాడు.
యూజీన్ తురై సింగం తరపున పనిచేస్తున్న రామ్‌దాస్.డ్రగ్స్ స్వభావంపై తనకు అవగాహన వుందంటూ చెబుతున్న మూడు వాంగ్మూలాలను వ్యతిరేకించాడు.ఈ కేసుకు సంబంధించి రామ్‌దాస్, రాజ్‌లను జూన్ 2020లో హైకోర్టు దోషులుగా నిర్ధారించింది.వీరిలో రామ్‌దాస్‌కు జీవిత ఖైదు, 15 లాఠీదెబ్బలను శిక్షగా విధించింది.
అయితే శుక్రవారం నాటి విచారణ సందర్భంగా అప్పీల్ కోర్టు వీరిపై నమోదు చేసిన నేరారోపణలను కొట్టివేసింది.